Site icon NTV Telugu

Southern Zonal Council: తెలంగాణ లేవనెత్తిన అంశాలివే.. ఆ సమస్యలు త్వరలో పరిష్కారం

Southern Zonal Council

Southern Zonal Council

Telangana Home Minister Mahmood Ali Asked To Solved These Issues On Southern Zonal Council: శనివారం తిరువనంతపురంలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ.. పలు అంశాలను లేవనెత్తారు. విభజన సమస్యల్ని త్వరగా పరిష్కరించాలని కోరారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డ్ ప్రకారం.. కృష్ణా నదీ జలాల్లో హక్కు వాటాలో భాగంగానే తాము పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ (ఎల్‌ఐఎస్), నక్కలగండి ఎల్‌ఐఎస్ శ్రీశైలం రిజర్వాయర్‌ ప్రాజెక్టుల్ని చేపట్టామని అన్నారు. ఈ విషయంలో కర్ణాటకకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎల్‌ఐఎస్‌ డీపీఆర్‌ను తాము ఇప్పటికే సీడబ్ల్యూసీకి సమర్పించామన్నారు. నక్కలగండి ఎల్‌ఐఎస్ డీపీఆర్ తయారీ ప్రస్తుతం తుది దశలో ఉందని, అది పూర్తైన వెంటనే సీడబ్ల్యూసీకి సమర్పిస్తామని చెప్పారు. అప్పుడే కర్ణాటక ముఖ్యమంత్రి కలగజేసుకొని.. ఆ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అయితే.. ఈ సమస్యను అపెక్స్ కౌన్సిల్ ముందు ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు.

అనంతరం.. విద్యుత్ బకాయిల విషయాన్ని మహమూద్ అలీ ప్రస్తావించారు. ఏపీ పవర్ యుటిలిటీస్ నుంచి తెలంగాణ పవర్ యుటిలిటీస్‌కు రూ.17,828 కోట్లు రావాల్సి ఉందని.. కానీ తెలంగాణకు చెల్లించాల్సిన మొత్తాలను పరిగణనలోకి తీసుకోకుండా విద్యుత్ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. అలాగే.. ఏపీ భవన్, న్యూఢిల్లీ ఆస్తుల విభజన సమస్య.. ఇరు రాష్ట్రాల పరస్పర అంగీకారంతోనే త్వరలో పరిష్కారమవుతుందని కౌన్సిల్‌కు వెల్లడించారు. విభజన చట్టంలోని కొన్ని నిబంధనలు తెలంగాణకు అనుకూలంగా, మరికొన్ని ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా ఉన్నాయన్నారు. అయితే.. చట్టాన్ని సవరించాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో అనుసరించిన విధానాన్ని అధ్యయనం చేయాలని అమిత్ షా సూచించారు. ఇక ఇదే సమయంలో.. మహిళలు, పిల్లలపై లైంగిక నేరాల కేసుల విచారణ అంశంలో తెలంగాణ ప్రభుత్వం పురోగతి సాధించిందని కేంద్ర హోంమంత్రి ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలకు కూడా ఈ విషయంలో మార్గనిర్దేశం చేయాలని వెల్లడించారు.

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మహమూద్ అలీ.. అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ, తక్కువ వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రం దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాల్లో ఒకటిగా అవతరించిందన్నారు. జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా 2014-15లో 4.1 శాతం ఉంటే.. 2021-22లో 4.9 శాతానికి పెరిగిందన్నారు. ఎన్నో వినూత్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టడంలో తెలంగాణ ముందున్నది పేర్కొన్నారు. 24 గంటలపాటు నిరంతరంగంగా విద్యుత్తును అందించడం, రైతులకు పెట్టుబడి మద్దతు సహా ఎన్నో కార్యక్రమాలతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని ఉందన్నారు. ఇక ఈ సమావేశం నిర్వహించినందుకు గాను అమిత్‌షాకు, అద్భుతమైన ఏర్పాట్లు చేసిన కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.

Exit mobile version