TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు

  • ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక ఫోకస్
  • ఫేషియల్ రికగ్నిషన్ హాజరు.. ఆర్‌ఓ ప్లాంట్ల ఏర్పాటుకు ఆదేశాలు
  • కాలేజీ భవనాల మరమ్మతులు, మౌలిక వసతుల పనులు వేగవంతం
  • ఇన్నోవేషన్ హ్యాకథాన్, మధ్యాహ్న భోజన పథకాలపై అధికారుల సమీక్ష
Inter Board

Inter Board

తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడం, మౌలిక వసతులను మెరుగుపరచడమే లక్ష్యంగా తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) కీలక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు (DIEOs) , ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కళాశాలల్లో బోధనా పద్ధతులు, పరిపాలనాపరమైన అంశాలు, విద్యార్థుల సంక్షేమంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు అప్‌డేట్ చేసిన నూతన సిలబస్‌ను సమర్థవంతంగా బోధించడంతో పాటు, సవరించిన ప్రాక్టికల్ పరీక్షల విధానాన్ని పక్కాగా అమలు చేయాలని కార్యదర్శి అధికారులను ఆదేశించారు. అలాగే అధ్యాపకుల బోధనా నైపుణ్యాలను నిరంతరం పెంచేందుకు వీలుగా ప్రత్యేక ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు నిర్వహించాలని సూచించారు.

ఫేషియల్ రికగ్నిషన్ హాజరు.. ఆర్‌ఓ ప్లాంట్లు, మరమ్మతులు తప్పనిసరి

కళాశాలల్లో విద్యార్థుల హాజరు నమోదు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా మార్చేందుకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) నమోదును తక్షణమే పూర్తి చేయాలని సెక్రటరీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమిస్తూ అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తాగునీటి కోసం ఆర్‌ఓ (RO) ప్లాంట్లను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. కళాశాల భవనాల మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులను తెలంగాణ విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (TGEWIDC) సహకారంతో వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

మధ్యాహ్న భోజనం, ఇన్నోవేషన్ హ్యాకథాన్ పురోగతిపై ఆరా

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అమలవుతున్న అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాల తీరుతెన్నులపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా సమీక్షించారు. విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలకు సమగ్ర శిక్షా అభియాన్ నిధులను పూర్తిస్థాయిలో సమర్థవంతంగా వినియోగించాలని నిర్ణయించారు. మరొకవైపు, ఇంటర్ విద్యార్థుల్లో పరిశోధనాత్మక ఆలోచనలు, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న 15 రోజుల ‘తెలంగాణ ఇన్నోవేషన్ హ్యాకథాన్’ పురోగతిని కూడా అధికారులు ఆరా తీశారు. కళాశాలల బలోపేతానికి బోర్డు తీసుకుంటున్న ఈ చర్యలతో సర్కారీ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం లభించనుంది.