Damodar Raja Narasimha : హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. జిల్లాల్లోనే కార్పొరేట్ వైద్యం..

  • జిల్లాల్లోనే మెరుగైన వైద్య సేవలు
  • 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యుల నియామకం
  • పడకల సంఖ్యను బట్టి వైద్య సదుపాయాలు
  • ప్రతి జిల్లాలో డీసీహెచ్‌ఎస్ కార్యాలయాలు
Damodara

Damodara

తెలంగాణ ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలను వారి సొంత జిల్లాల్లోనే అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, స్పెషలిస్ట్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, వైద్య పరికరాలు, రోగ నిర్ధారణ పరీక్షల సదుపాయాలను పెంచుతున్నామని వెల్లడించారు. సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థను బలోపేతం చేస్తే చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కూడా హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.

ఆసుపత్రుల వారీగా వైద్య సేవల విస్తరణ

సోమవారం సచివాలయంలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్‌-TVVP) పునర్వ్యవస్థీకరణపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) రూపొందించిన అధ్యయన నివేదికలోని ప్రతిపాదనలను ఆయన పరిశీలించారు. ప్రతి ఆసుపత్రిలో ప్రస్తుతం ఏయే స్పెషలిస్ట్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి? ఇంకా ఏ విభాగాల్లో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది అవసరం ఉంది? ఎలాంటి వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ సదుపాయాలు కల్పించాలి? అనే అంశాలపై ఆసుపత్రుల వారీగా సమగ్ర సమీక్ష చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఇటీవల డీఎస్‌హెచ్‌ పరిధిలోని ఆసుపత్రుల కోసం 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించినట్లు మంత్రి గుర్తుచేశారు. అవసరమైన మేరకు నర్సులు, టెక్నీషియన్ల నియామకాలు కూడా చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న నియామకాల ఫలితాలు ప్రజలకు అందాలంటే ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సిబ్బందిని సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. స్పెషలిస్ట్ వైద్యులు ఉన్నప్పటికీ అవసరమైన పరికరాలు, ఇతర సిబ్బంది లేక వైద్య సేవలు అందించలేని పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు.

పడకల సంఖ్యను బట్టి వైద్య సేవలు

30 పడకలు, 50 పడకలు, 100 పడకలు, అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఆసుపత్రులకు వాటి స్థాయికి అనుగుణంగా వైద్య సేవల పరిధిని నిర్ణయించాలని మంత్రి సూచించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండాల్సిన స్పెషాలిటీ విభాగాలు, పడకలు, ఆపరేషన్ థియేటర్లు, ల్యాబ్‌లు, ఇతర సదుపాయాలపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని అధికారులకు తెలిపారు.

రాష్ట్రంలోని సెకండరీ హెల్త్ కేర్ ఆసుపత్రులను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ (IPHS) మార్గదర్శకాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ప్రతి ఆసుపత్రిలో అవసరమైన వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు, మందులు, వైద్య పరికరాలు, రోగ నిర్ధారణ పరీక్షల సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సిబ్బంది కొరతపై సమగ్ర సమీక్ష

ప్రస్తుతం ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య, మంజూరైన పోస్టులు, ఐపిహెచ్‌ఎస్ ప్రమాణాల ప్రకారం అవసరమైన సిబ్బంది సంఖ్యను పోల్చి చూడాలని మంత్రి సూచించారు. ఈ లెక్కల ఆధారంగా ఎక్కడెక్కడ సిబ్బంది కొరత ఉందో గుర్తించాలని తెలిపారు. ఇప్పటికే ఉన్న పోస్టులను ఆసుపత్రుల అవసరాలకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించడంతో పాటు, అదనంగా అవసరమైన పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి జిల్లాలో డీసీహెచ్‌ఎస్ కార్యాలయాలు

ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (DCHS) కార్యాలయాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపైనా మంత్రి సమీక్షించారు. రాష్ట్రస్థాయి డైరెక్టరేట్ నుంచి జిల్లా స్థాయి వరకు స్పష్టమైన పరిపాలనా బాధ్యతలు ఉండాలని సూచించారు. జిల్లాల్లోని ఆసుపత్రుల పనితీరు, వైద్య సేవల నాణ్యత, మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు.

ఆసుపత్రుల్లో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వైద్య సేవల్లో ఉన్న లోటుపాట్లు, సిబ్బంది అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించే బాధ్యతలను జిల్లా స్థాయి అధికారులకు అప్పగించాలని సూచించారు. మొత్తంగా రాష్ట్రంలోని సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థను బలోపేతం చేసి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను జిల్లాల్లోనే అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.