పుస్తకాల్లోని పాఠాలకే పరిమితం కాకుండా విద్యార్థులకు మన రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, ప్రకృతి అందాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘తెలంగాణ దర్శిని’ పేరుతో విద్యార్థుల కోసం ప్రత్యేక విద్యా పర్యటనలు నిర్వహించాలని నిర్ణయించింది. సమగ్ర శిక్షా పథకంలో భాగంగా పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులకు ఈ అద్భుత అవకాశం కల్పించనుండగా, ఇందుకోసం ప్రభుత్వం రూ.26.30 కోట్ల నిధులను మంజూరు చేసింది.
2.92 లక్షల మంది విద్యార్థులకు అవకాశం.. ఖర్చుల వివరాలు ఇలా
విద్యాశాఖతో పాటు పర్యాటక, సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ, అటవీ శాఖల సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,92,286 మంది విద్యార్థులను విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేశారు. రెండో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులకు వారి తరగతుల స్థాయికి తగ్గట్లుగా ఈ టూర్లను ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.900 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఇందులో విద్యాశాఖ సర్వశిక్షా అభియాన్ నిధుల నుంచి రూ.500, పర్యాటక శాఖ నుంచి రూ.400 సమకూర్చనున్నారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) పర్యవేక్షణలో జరిగే ఈ పర్యటనల షెడ్యూల్, ప్రదేశాల ఎంపిక బాధ్యతలను సంస్థ ఎండీకి అప్పగించారు.
చారిత్రక కట్టడాల నుంచి టైగర్ రిజర్వ్‌ల వరకు సందర్శన
ఈ పర్యటనల్లో భాగంగా తెలంగాణలోని ప్రసిద్ధ చారిత్రక కట్టడాలు, ఆలయాలు, కళా కేంద్రాలు, ప్రకృతి రమణీయ ప్రాంతాలను విద్యార్థులకు చూపించనున్నారు. హైదరాబాద్‌లోని గోల్కొండ కోట, చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్‌తో పాటు వరంగల్ కోట, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం, వేయి స్తంభాల గుడి, భువనగిరి కోట, బుద్ధవనం, కొలనుపాక జైన మందిరం వంటి వారసత్వ కట్టడాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు. వీటితో పాటు శిల్పారామం, పోచంపల్లి, చేర్యాల, నిర్మల్ ప్రాంతాల్లోని విశ్వవిఖ్యాత హస్తకళల విశిష్టతను విద్యార్థులకు వివరిస్తారు. అలాగే ప్రకృతిపై అవగాహన కోసం అనంతగిరి కొండలు, లక్నవరం, పాకాల సరస్సులు, కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లు, మేడారం, నాగార్జునసాగర్ వంటి ప్రాంతాల సందర్శనకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
భావితరాలకు తెలంగాణ వైభవాన్ని పరిచయం చేయడమే లక్ష్యం: మంత్రి జూపల్లి
తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను క్షేత్రస్థాయిలో కళ్లారా చూడటం వల్ల విద్యార్థుల్లో మన సంస్కృతి, పర్యావరణంపై మమకారం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ వారసత్వ సంపదను, పర్యాటక ప్రాధాన్యతను భావితరాలకు అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఈ ‘తెలంగాణ దర్శిని’ యాత్రలు విద్యార్థులకు అటు విజ్ఞానాన్ని, ఇటు మరపురాని ఆహ్లాదాన్ని అందిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

