తెలంగాణలో మార్చిలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదు అయ్యాయి.. కొమురం భీం జిల్లా కెరమెరిలో ఇవాళ అత్యధికంగా 43.9, కౌటాలలో 43.7, చెప్రాలలో 43.8 డిగ్రీలుగా నమోదు కాగా.. జైనాథ్‌లో 43.8 డిగ్రీలు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది.. అయితే, ఎండ తీవ్రత నేపథ్యంలో పాఠశాలల సమయం కుదించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎస్ సోమేష్ కుమార్.. రాష్ట్రంలో ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు సూచించిన సీఎస్ సోమేష్ కుమార్.. రాష్ట్రంలో నెలకొని ఉన్న తీవ్ర ఎండల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎస్ సోమేష్ కుమార్.
Read Also: Breaking: కొత్త జిల్లా ఫైనల్ డ్రాఫ్ట్‌కు కేబినెట్ ఆమోదం..
ఇక, రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు సోమేష్ కుమార్.. రానున్న రెండురోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్ తదితర జిల్లాల్లో రెండు నుండి నాలుగు డిగ్రీల మేరకు ఉష్టోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, అన్ని ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేయాలని సూచించారు. అదేవిధంగా సరిపడా ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్న ఆయన.. ఎండ తీవ్రత వల్ల ఏవిధమైన ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఎండల ప్రభావం వల్ల కలిగే ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్య ప్రర్చాలని కలెక్టర్లను ఆదేశించారు.. అన్ని జిల్లాల్లో 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలని సూచించిన ఆయన.. ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పాఠశాల సమయాన్ని మరింత తగ్గించాలని, అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు ఎండలో పని చేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు సీఎస్ సోమేష్ కుమార్. ఇక, రేపటి నుంచి స్కూల్స్ ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయని… ఈ సమయం ఏప్రిల్ 6వ తేదీ వరకు అమల్లో ఉంటుందని తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రకటించారు.
