Site icon NTV Telugu

Ambedkar statue: నేడు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం.. ముఖ్యఅతిథిగా మనవడు

Ambedkar Statue April14

Ambedkar Statue April14

Ambedkar statue: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నేడు సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. భారత రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించేందుకు హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించనున్నారు. గులాబీలు, పువ్వులు తమలపాకులతో అల్లిన భారీ పూలమాలను రూపొందించారు. 125 అడుగుల విగ్రహానికి ఉన్న భారీ కర్టెన్‌ను తొలగించి నిలువుగా అలంకరించేందుకు భారీ క్రేన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బౌద్ధ సన్యాసులను మాత్రమే ఆహ్వానించారు. వారి సాంప్రదాయ పద్ధతిలో జరుగనుంది. అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మహారాష్ట్రకు చెందిన అంబేద్కర్ విగ్రహ రూపశిల్పి రామ్ వంజీ సుతార్‌ను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా సన్మానించనున్నారు. సచివాలయ సిబ్బంది, అధికారులు, అన్ని శాఖల హెచ్‌ఓడీలు, జిల్లా కలెక్టర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 35,700 మంది విగ్రహావిష్కరణ సభకు హాజరు కానున్నట్లు సమాచారం.

ప్రజలను తరలించేందుకు 750 ఆర్టీసీ బస్సులను బుక్ చేశారు. హైదరాబాద్ చేరుకోవడానికి 50 కిలోమీటర్ల లోపు సభకు వచ్చిన ప్రజలకు భోజన ఏర్పాట్లు చేశారు. ప్రజల కోసం లక్ష స్వీట్ ప్యాకెట్లు, లక్షన్నర మజ్జిగ ప్యాకెట్లు, లక్షన్నర వాటర్ ప్యాకెట్లను సిద్ధం చేశారు. అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎండ వేడిమి నుంచి ప్రజలను రక్షించేందుకు షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహావిష్కరణకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆహ్వానితులు హాజరుకానున్నారు. అంబేద్కర్ స్మృతి వనంలో దాదాపు 40 వేల మంది కుర్చీలు ఏర్పాటు చేశారు. ఎంపిక చేసిన ఆహ్వానితులకు ఇప్పటికే ఆహ్వాన కార్డులు అందించబడ్డాయి.

ఆటపాటలతో సంబురాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గాయకుడు సాయిచంద్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. అంబేద్కర్‌కు సంబంధించిన పాటలు మాత్రమే పాడి అంబేద్కర్‌కు సాంస్కృతిక నివాళులర్పించాలని సీఎం సూచించారు. ఇందుకు రిహార్సల్స్ బాధ్యతను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీసుకున్నారు. సీఎం కేసీఆర్ తుది సందేశం ఇవ్వనున్నారు. సభ జరిగే రోజు సామాన్య ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసు యంత్రాంగం సూచించనుంది.

కార్యక్రమ వివారలు:

* మధ్యాహ్నం 2.30 గంటలకు హుస్సేన్ సాగర్ సమీపంలోని అంబేద్కర్ మహా విగ్రహానికి సీఎం కేసీఆర్ చేరుకుంటారు.

* ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు.

* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రారంభోపన్యాసం చేస్తారు. ఆమె ప్రసంగంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది.

* అనంతరం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ముఖ్యఅతిథి ప్రకాష్ అంబేద్కర్ ప్రసంగిస్తారు.

* ఆ తర్వాత సీఎం కేసీఆర్ జయంతి వేడుకల్లో ప్రసంగిస్తారు.

* సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా కృతజ్ఞతలు తెలుపుతారు.

* ఆయన ప్రసంగంతో సాయంత్రం 5 గంటలకు సభ ముగుస్తుంది.
Plane Crash: 1976లో విమాన ప్రమాదం..సీఎంతో సహా 10 మంది మృతి.. 47 ఏళ్ల తర్వాత నిజం తెలిసింది..

Exit mobile version