Site icon NTV Telugu

CM KCR Press Meet: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. 57 ఏళ్లకే పెన్షన్

Cm Kcr

Cm Kcr

CM KCR Press Meet: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు వరాలు ప్రకటించారు. తెలంగాణలో ఆగస్టు15 నుంచి కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు ఇస్తామని కేసీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36 లక్షల మందికి పెన్షన్ ఇస్తుండగా.. ఆగస్టు 15 నుంచి ఈ సంఖ్య 46 లక్షలకు చేరుతుందన్నారు. 57 సంవత్సరాలున్న వారికి ఆసరా పెన్షన్‌లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పాత, కొత్త పెన్షనర్లకు బార్‌కోడ్‌లతో కొత్త పుస్తకాలు ఇస్తామని కేసీఆర్ వివరించారు. అటు రాష్ట్రంలో డయాలసిస్ పేషంట్లకు ప్రస్తుత సహకారం కొనసాగిస్తూనే కొత్తగా ఆసరా పెన్షన్ వర్తింపచేస్తామని చెప్పారు. డయాలసిస్ రోగులకు కూడా ఆసరా కింద రూ.2,016 పెన్షన్ అందిస్తామన్నారు. అంతేకాకుండా ఆగస్టు 15న వివిధ జైళ్లలోని 75 మందిని విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కేసీఆర్ పేర్కొన్నారు.

Read Also: CM KCR-NITI Aayog: నేతి బీరకాయలో నెయ్యి ఎంతుంటదో నీతి ఆయోగ్‌లో నీతీ అంతే ఉంది: సీఎం కేసీఆర్‌

మరోవైపు కేంద్ర ప్రభుత్వం విధించే జీఎస్టీపై కేసీఆర్ మండిపడ్డారు. పిల్లలు తాగే పాలపైనా జీఎస్టీని విధిస్తుండటం బాధాకరమని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నేతన్నలు పూట గడవడం కష్టమవుతుంటే చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం దారుణమన్నారు. అల్పాదాయ వర్గాలపై పన్నుల భారం మోపితే ఎలా బ్రతకగలరో కేంద్రం ఆలోచించాలన్నారు. ప్రధానికి చేతులు జోడించి నమస్కరిస్తున్నానని… దయచేసి పాలపై జీఎస్టీ తీసివేయాలని, చేనేత కార్మికులపై దిక్కుమాలిన జీఎస్టీని ఎత్తివేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రాల అభివృద్ధిని నిరోధించే ఎఫ్‌ఆర్‌బీఎంపై ఆంక్షలు ఎత్తేయాలన్నారు.

Exit mobile version