నిషేధిత ఆస్తుల (POB / 22A) జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజలు ఎలాంటి అపోహలు, ఆందోళనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం కొత్తగా ఎలాంటి భూములను నిషేధిత జాబితాలో చేర్చలేదని, గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న చట్టపరమైన, సాంకేతిక చిక్కులను పరిష్కరించి బాధితులకు త్వరితగతిన ఊరట కలిగిస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జిల్లా సబ్-రిజిస్ట్రార్లతో 22A/POB అంశంపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ చట్టబద్ధంగా న్యాయం చేస్తామని, POB దరఖాస్తులను యుద్ధపాతిపదికన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఆన్‌లైన్ డాక్యుమెంట్లతో ఫోర్జరీకి చెక్ – 14లోగా అప్‌లోడ్ చేయాలని ఆదేశం
భూముల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు జారీ చేసిన జీవోలు, ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్, లే-అవుట్ల అనుమతుల వివరాలన్నింటినీ ఈ నెల 14వ తేదీలోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని మంత్రి ఆదేశించారు. దీనివల్ల రిజిస్ట్రేషన్ సమయంలో ఏది బోగస్ డాక్యుమెంట్, ఏది అసలైనది అనే దానిపై సబ్ రిజిస్ట్రార్లకు స్పష్టత వస్తుందని, ఫోర్జరీ పత్రాలకు అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు. మరింత పారదర్శకత కోసం పహానీలను కూడా సబ్ రిజిస్ట్రార్లకు యాక్సెస్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వచ్చిన దరఖాస్తుల్లో జెన్యూన్ ఉన్నవాటిని గుర్తించి తక్షణమే పరిష్కరించాలని, సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా కలెక్టర్లు ప్రజా కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
సబ్ రిజిస్ట్రార్ల విచక్షణాధికారాలకు చెక్ – ఇకపై దరఖాస్తులు నేరుగా కలెక్టర్‌కే
సబ్ రిజిస్ట్రార్లకు ఎలాంటి విచక్షణాధికారాలు, అదనపు అధికారాలు ఉండకూడదని మంత్రి తేల్చిచెప్పారు. ఆన్‌లైన్‌లో ఉన్న వివరాల మేరకే వారి అధికారాలను పరిమితం చేయాలని ఆదేశించారు. POB జాబితాలో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లను గుడ్డిగా తిరస్కరించకుండా, ఒకవేళ తిరస్కరిస్తే అందుకు గల కారణాలను మూడు రోజుల్లో తెలియజేయాలని స్పష్టం చేశారు. ఇకపై POB దరఖాస్తులను తహశీల్దార్‌కు పంపకుండా నేరుగా కలెక్టర్‌కే పంపాలని, కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ మధ్యనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలని కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు.
అర్హులకు అన్యాయం చేస్తే సహించేది లేదు – కఠిన హెచ్చరికలు
22A పేరిట ఉద్దేశపూర్వకంగా పేదలకు, అర్హులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని, ప్రభుత్వ ఆస్తులను కాపాడే విషయంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని పొంగులేటి హెచ్చరించారు. ఏ చిన్న తప్పు చేసినా అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. నాలుగు జిల్లాల సబ్ రిజిస్ట్రార్లతో వెంటనే సమావేశం నిర్వహించి, ఈ నిర్ణయాలను తక్షణమే అమలు చేయాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీని ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంత్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

