NTV Telugu Site icon

Jagital: అక్కడ హెల్మెట్‌ ధరించాల్సిందే.. రోడ్డు మీద కాదండోయ్‌ ఆఫీస్‌ లో..!

Jagital

Jagital

Jagital: ద్విచక్రవాహనంపై రోడ్డుపై వెళ్తున్నట్లయితే హెల్మెట్ ధరించాలి. లేదంటే ఫైన్ పడడం ఖాయం.. కానీ, రోడ్డుపై వెళ్లేటప్పుడు అనుకుంటున్నారా? కాదండోయ్ నేను చెప్పేది ఒక ఆఫీస్ లో హెల్మెట్ ధరించడం గురించి. ఆ ఆఫీసులో పనిచేయాలన్నా సిబ్బందికి హెల్మెట్ తప్పనిసరి. లేదంటే తల పగిలిపోవడం ఖాయం. అదేంటీ.. ఆఫీసులో కూర్చుని పని చేయడానికి కుర్చీ, టేబుల్, కంప్యూటర్, ఫైల్స్, పెన్నులు ఇలా అన్నీ అవసరమని విన్నాం కానీ ఇప్పుడు… హెల్మెట్ కావాలా? వాళ్లకి ఏమైనా పిచ్చా.. అనుకుంటున్నారా.. అసలు విషయం తెలిస్తే.. కరెక్ట్ అంటారు.

Read also: Bablu IIIT Student: ఐఐఐటీ మరో విద్యార్థి మృతి.. హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య..!

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం శిథిలావస్థలో ఉన్న ప్రైవేట్ భవనంలో నడుస్తోంది. అయితే.. అప్పటికే శిథిలావస్థకు చేరిన ఆ భవనం.. వర్షాకాలం వచ్చిందంటే పైనుంచి రాళ్లు కింద పడుతున్నాయి. ఈ క్రమంలో.. ఎవరి నెత్తిన ఏ రాయి పడుతుందోఅని భయంతో బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు సిబ్బంది. అయితే.. అంతకుముందే కార్యాలయంలో కొంత భాగం కూలిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు పైకప్పు ఏ క్షణాన కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కార్యాలయంలో పనిచేసేందుకు ఉద్యోగులు భయంతో జంకుతున్నారు. శిథిలావస్థలో ఉన్న ఈ భవనం నుంచి ఎంపీడీఓ కార్యాలయాన్ని తరలించాలని ఇక్కడి ఉద్యోగులు ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి మొరపెట్టుకున్నా ఫలితం లేదు.

ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమకు ప్రాణభయం ఉందని అధికారులకు తెలియజేసేందుకు సిబ్బంది వినూత్న ఆలోచన చేశారు. తలలు పగలకుండా ఉండేందుకు హెల్మెట్ పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు. కార్యాలయానికి వచ్చే వారు సైతం హెల్మెట్ ధరించి విధులు కొనసాగిస్తున్న ఉద్యోగుల బాధలు చూసి ఆశ్చర్యపోతున్నారు. స్థానిక అంజన్న దేవాలయంలో సిబ్బంది రోజూ దండం పెట్టుకుని, అధికారుల మనసు మార్చి కార్యాలయాన్ని అక్కడి నుంచి తరలించేలా చూడాలని ఆంజనేయుడిని ప్రార్థిస్తున్నారు. మరి అధికారులు ఆంజనేయులు చొరవతో కార్యాలయాన్ని మారుస్తారో లేదో చూడాలి.
Biryani Boxes : ఈ బాక్సుల్లో బిర్యానిని లాగిస్తున్నారా?..అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..