Duddiilla Sridhar Babu : విమర్శలు పట్టించుకోం.. అభివృద్ధిలో తగ్గేదేలే

  • పుష్కర ఘాట్ పనుల పరిశీలన
  • నాణ్యతతో పనులు పూర్తి చేయాలి
  • విమర్శలపై శ్రీధర్ బాబు కౌంటర్
  • త్వరలో అడ్వాన్స్ టెక్నాలజీ ఐటీఐ ప్రారంభం
Sridhar Babu

Sridhar Babu

పెద్దపల్లి జిల్లా మంథనిలోని గోదావరి నది వద్ద జరుగుతున్న పుష్కర ఘాట్ పనులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. మంథని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నామని, విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

పుష్కర ఘాట్ పనుల్లో నాణ్యత, వేగం పెంచాలి

గోదావరి నది వద్ద కొనసాగుతున్న పుష్కర ఘాట్ పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతం చేయాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. పనుల్లో ఎక్కడా జాప్యం లేకుండా, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

విమర్శలు పక్కనపెట్టి అభివృద్ధి బాటలో..

మంథని నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తుంటే కొందరికి పచ్చ కామెర్ల వాళ్లకు పచ్చగా కనబడుతున్నట్లుగా అనిపిస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు. తాము చేపడుతున్న అభివృద్ధి పనులను ఓర్వలేకనే కొంతమంది విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఆ విమర్శలను పక్కనపెట్టి మంథని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.

మంథనిలో అడ్వాన్స్ టెక్నాలజీ ఐటీఐ సంస్థ

అడ్వాన్స్ టెక్నాలజీ ఐటీఐకి సంబంధించిన ఒక విద్యా సంస్థను మంథనికి తీసుకొచ్చామని శ్రీధర్ బాబు తెలిపారు. ఆ సంస్థ భవన నిర్మాణ పనులను పూర్తి చేసి, త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.