NTV Telugu Site icon

Sri Rama Navami : కమనీయం.. కడు రమణీయం.. శ్రీ సీతారాముల కల్యాణం..

Bhadradri

Bhadradri

సిరి కళ్యాణపు బొట్టును పెట్టి… మణి బాసికమును నుదుటను కట్టి… పారాణిని పాదాలకు పెట్టి.. పెళ్ళికూతురై వెలసిన సీతమ్మ తల్లిని.. సంపగి నూనెను కురులను దువ్వి… సొంపుగ కస్తూరి నామము దీర్చి… చెంపజవాజి చుక్కను పెట్టి.. పెళ్ళికొడుకై వెలసిన రామయ్య తండ్రిని చూసేందుకు రెండు కన్నులు చాలవెమో.. అనిపించే విధంగా అంగరంగ వైభవంగా భద్రాద్రిలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. అభిజిత్‌ లగ్నంలో రాముడు, జగన్మాత సీతమ్మ మెడలో… మాంగళ్యధారణ చేశారు. తానీషా కాలం నాటి నుంచి కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌… స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అయితే కరోనా కాటుతో రెండు సంవత్సరాల తరువాత దేవదేవుడి కల్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించారు. తొలుత ఉదయం 9 గంటల వరకు మూలమూర్తులకు ఏకాంతంగా తిరుకల్యాణం జరిపారు. ఆ తరువాత మిథిలా మైదానంలో సుందరంగా ముస్తాబైన మండపానికి వేదమంత్రోచ్ఛరణ నడమ దేవతామూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మిథిలా మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై అభిజిత్‌ లగ్నంలో అర్చకులు కల్యాణోత్సవాన్ని కమనీయంగా జరిపించారు.

కల్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు భక్తులు భారీగా హాజరయ్యారు. భక్తుల రామనామస్మరణతో భదాద్రి మారుమోగింది. రేపు వైభవంగా శ్రీరామచంద్ర పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో 2 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.భక్తులకు పంపిణీ చేసేందుకు వీలుగా 2 లక్షల ప్యాకెట్ల స్వామి వారి తలంబ్రాలను అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం.

AP New Cabinet : ఉత్కంఠలో ఆశావహులు.. చివరి నిమిషంలో జగన్‌ మార్పులు..