NTV Telugu Site icon

అయ్యప్ప భక్తులకు శుభవార్త… తెలంగాణ నుంచి శబరిమలకు 200 బస్సులు

తెలంగాణ నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ శుభవార్త అందించింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి శబరిమలకు 200 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. పంబా వద్ద స్పాట్ బుకింగ్ ద్వారా బస్సులోని భక్తులందరూ ఒకేసారి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునే వెసులుబాటును కూడా కల్పించినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. అలాగే బస్సును ముందుగానే బుక్ చేసుకుంటే గురుస్వామితోపాటు మరో ఆరుగురికి ఉచిత ప్రయాణ సౌకర్యం లభిస్తుందన్నారు. ప్రత్యేక బస్సులు, ఇతర వివరాల కోసం 040-30102829లో సంప్రదించాలని సజ్జనార్ కోరారు.

Read Also: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు: టీఆర్ఎస్‌ క్లీన్‌స్వీప్

ఒకవేళ అనుకోని కారణాల వల్ల బుకింగ్‌ను రద్దు చేసుకుంటే తక్కువ మొత్తంలో మాత్రమే ఛార్జీలు వసూలు చేస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. 48 గంటల ముందు బస్సు బుకింగ్ రద్దు చేసుకుంటే గతంలో మాదిరిగా రూ. 1,000 వసూలు చేస్తామన్నారు. 24 నుంచి 48 గంటల లోపు రద్దు చేసుకుంటే గతంలో అద్దె మొత్తంలో 10 శాతాన్ని మినహాయించేవారు అని.. ఇకపై రూ. 5 వేలు మాత్రమే మినహాయించుకుని మిగతా డబ్బులు చెల్లిస్తామన్నారు. 24 గంటల నుంచి బస్సు బయలుదేరే సమయం ముందు వరకు రద్దు చేసుకుంటే గతంలో 30 శాతం వసూలు చేసేవారు అని… ఇకపై దానిని రూ. 10 వేలకు పరిమితం చేసినట్లు సజ్జనార్ వివరించారు.