NTV Telugu Site icon

Harish Rao: రేపు గన్ మెన్లు లేకుండా రా నేనే కారు నడుపుతా.. సీఎంకు హరీష్ రావు సవాల్..

Harish Rao Revanth Reddy

Harish Rao Revanth Reddy

Harish Rao: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌ రావు సవాల్ విసిరారు. మూసి బాధితుల దగ్గరకు, మల్లన్న సాగర్ కు పోదామన్నారు. రేపు ఉదయం 9 గంటలకు నేను సిద్ధంగా ఉంటాను.. గన్మెన్ లు లేకుండా పోదాం అని సీఎం రేవంత్ అన్నారని గుర్తు చేశారు. నేను కార్ నడుపుకుంటూ వస్తాను.. నా పక్కన కూర్చో.. ఇద్దరం కలిసి వెళ్దామని హరీష్ రావు సవాల్ విసిరారు. గ్రాఫిక్ హంగులతో సీఎం రేవంత్ రెడ్డి తన రియల్ ఎస్టేట్ డ్రీమ్ ప్రాజెక్ట్ ను నిన్న ప్రెస్ మీట్ లో చూపించారని మండిపడ్డారు.

మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదన్నారు. మూసీ సుందరీకరణను బీఆర్ఎస్ ఎప్పుడో ప్రారంభం చేసిందన్నారు. దీని పేరుతో పేదల ఇండ్లు కూలగొడతాం అంటున్నారు దానికి మేము వ్యతిరేకమని స్పష్టం చేశారు. మూసీ నది పునరుజ్జీవనమే తప్ప సుందరీకరణ కాదని ముఖ్యమంత్రి చెప్పారని తెలిపారు. విదేశీ కంపెనీ ఇచ్చిన వీడియో చూస్తే మాత్రం న్యూయార్ టైం స్క్వేర్ ను మించిన వెలుగు జిలుగులు, సిడ్నీ ఒపెరా హౌజ్ ను తలదన్నే హైరైజ్ బిల్డింగులు, లండన్ లోని థేమ్స్ నది మీదున్న బ్రిడ్జిని మించిన బ్రిడ్జిలు చూపెట్టారని తెలిపారు.

Read also: Minister Seethakka: అభివృద్ధి వికేంద్రీకరణ జరగకపోతే ప్రజల్లో వివక్షతా భావం పెరుగుతుంది..

ప్రపంచ దేశాల్లో ఉన్న రివర్ ఫ్రంటులన్నీ ఒక్క దగ్గర వేసి దంచి నూరి ఏఐలో వేసి తీసినట్టున్న పంచవన్నెల దృశ్యాలను చూపించాడన్నారు. నది పునరుజ్జీవనం అంటే సజీవంగా గలగలపారే స్వచ్ఛమైన జలాలు, సుందరీకరణ అంటే మీరు చూయించిన హైటెక్కులు, అద్దాల ఏఐ బిల్డింగులు.. ఉండవంటూనే ఎన్నెన్నో అందాలను చూయించారని తెలిపారు. ముఖ్యమంత్రి మాట కరెక్టా? కాంట్రాక్టు తీసుకున్న కంపెనీల కన్సార్షియం చూపించింది కరెక్టా? అని ప్రశ్నించారు. మీ ప్రజెంటేషన్ లో రివర్ రెజునెవేషన్ అండ్ రివర్ ఫ్రంట్ అని ఉంది.. రివర్ రెజునెవేషన్ అంటే నదీ పునరుజ్జీవనం.. మరి ఈ ఫ్రంట్ ఏంది? దాని వెనుక దాగి ఉన్న స్టంట్ ఏంది? అని హరీష్ రావు ప్రశ్నించారు.

నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధ్బుత విన్యాసం చూసామన్నారు. ఇచ్చిన హామీలు దృష్టి మరల్చే విధంగా చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ కు మూడు దిక్కులా సముద్రం ఉంది అని సీఎం అంటున్నారని గుర్తుచేశారు. హైదరాబాద్ లో మాత్రమే నగరం మధ్యలో నుంచి నది వెళుతోంది అన్నారు. చాలా నగరాల మధ్యలో నది వెళ్తుందని హరీష్ రావు చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఒక్క సీటు గెలవలేదు అన్నారు. కాంగ్రెస్ చాలా రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఒక్క సీటు కూడా గెలవలేదని తెలిపారు. సీఎం ప్రెస్ మీట్ లో చాలా అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు.
Ex Minister Harish Rao: మాజీ మంత్రి బంధువులపై చీటింగ్‌ కేసు నమోదు..