Siddipet Fake Death Certificate Scam: బతికున్నోళ్లను చంపేశారు.. 22 నకిలీ డెత్ సర్టిఫికెట్లతో స్కామ్

  • ప్రభుత్వ డిజిటల్ కీని ప్రైవేట్ వ్యక్తికి విక్రయం
  • 22 నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాల తయారీ
  • బతికున్నవారి పేర్లతో ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు
  • ఇద్దరిపై కేసు నమోదు.. పోలీసుల దర్యాప్తు
Siddipet Fake Death Certifi

Siddipet Fake Death Certifi

Siddipet Fake Death Certificate Scam : సిద్దిపేట జిల్లాలో దిగ్భ్రాంతికరమైన నకిలీ డెత్ సర్టిఫికేట్ల కుంభకోణం వెలుగు చూసింది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, ప్రైవేటు వ్యక్తుల ఆశ కలగలసి బతికి ఉన్న వ్యక్తుల పేర్లతో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి లక్షలాది రూపాయల ఇన్సూరెన్స్ సొమ్మును కాజేసిన దారుణ ఉదంతం కలకలం రేపుతోంది. ప్రభుత్వ డిజిటల్ కీని ప్రైవేట్ వ్యక్తులకు తెగనమ్మి ఈ భారీ స్కామ్‌కు బాటలు పరిచారు.

ప్రభుత్వ ‘ఈ-సైన్ డాంగిల్’ విక్రయం.. ముడుపుల మత్తులో సెక్రటరీ

చేర్యాల మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన భూక్య మధు, ప్రభుత్వానికి చెందిన అత్యంత కీలకమైన ‘ఈ-సైన్ డాంగిల్’ (డిజిటల్ కీ) ను హైదరాబాద్‌కు చెందిన రమేష్ అనే ప్రైవేట్ వ్యక్తికి అమ్ముకున్నాడు. ఈ అక్రమ వ్యవహారంలో పంచాయతీ సెక్రటరీ మధుకు భారీగా ముడుపులు ముట్టినట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ అధికారిక డిజిటల్ సంతకాన్ని ప్రైవేటు వ్యక్తి చేతిలో పెట్టడంతో ఈ స్కామ్ మొదలైంది.

హైదరాబాద్‌లో నకిలీ సర్టిఫికేట్ల దందా

పంచాయతీ సెక్రటరీ నుంచి పొందిన డిజిటల్ సైన్ల ఆధారంగా హైదరాబాద్‌లోని ఒక ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడైన రమేష్ నకిలీ డెత్ సర్టిఫికేట్ల తయారీకి తెరలేపాడు. 2026 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఏకంగా 22 నకిలీ డెత్ సర్టిఫికెట్లను తయారు చేసినట్లు విచారణలో తేలింది. కుటుంబ సభ్యుల పేర్లపై భారీగా ఇన్సూరెన్స్ పాలసీలు కట్టించి, వారు సజీవంగా బతికి ఉండగానే చనిపోయినట్లు ఈ నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ల ద్వారా రూ.లక్షలు కాజేసినట్లు సమాచారం.

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. దర్యాప్తు ముమ్మరం

ఈ భారీ డిజిటల్ ఫ్రాడ్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. విషయం తెలిసిన వెంటనే ఎంపీఓ (MPO) స్పందించి చేర్యాల పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఎంపీఓ ఫిర్యాదు మేరకు పంచాయతీ సెక్రటరీ మధుతో పాటు ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు రమేష్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ స్కామ్‌లో ఇంకా ఎంతమంది ప్రమేయం ఉంది, ఎంత మొత్తంలో ఇన్సూరెన్స్ డబ్బులు పక్కదారి పట్టాయనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.