NTV Telugu Site icon

Basara IIIT: మెస్ లో ఫర్నిచర్ కొరత.. ట్విట్టర్ వేదికగా విద్యార్థుల ఆవేదన

Basara Iiit

Basara Iiit

గ్రామీణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక విద్యను అందించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన బాసర ట్రిపుల్‌ ఐటీలో మళ్లీ వివాదం చెలరేగింది. భోజన, బోధన, వసతి పరంగా భవిష్యత్‌ లో సమస్యలు ఉత్పన్నం కాకుండా విద్యార్థులు ఎన్ని ఆందోళనలు చేపట్టిన.. అదే తీరులో కొనసాగుతోంది. బాసర ట్రిపుల్‌ ఐటీ కాలేజీ నెలకొన్న సమస్యలు మళ్లీ ఎన్టీవీ వెలుగులోకి తెచ్చింది. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ మెస్ లో ఫర్నిచర్ కొరత పై ట్విట్టర్ వేదికగా ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు. మెస్ దుస్థితిపై స్పందించిన ట్రిపుల్ ఐటీ ఎస్. జీ. సీ. స్టూడెంట్స్‌ కింద కూర్చుని భోజనం చేసే ఫొటోలు సోషల్ వేదికగా పోస్ట్ చేసారు. వారికి అన్ని సదుపాయాలు సమకూరుస్తామన్న ట్రిపుల్‌ ఐటీ సిబ్బంది తీరు ఇదని.. మా పరిస్థతి ఏమీ మారలేదని దానికి సాంకేతంగా అనిపించే విధంగా విద్యార్థులు తమ ఆవేదనను వెల్లడించినట్లైంది. దీంతో ట్రిపుల్‌ ఐటీలో విధ్యార్థులకు ఎటువంటి వసతులు లభించడంలేదని తేటతెల్లం అయింది.

మరి దీనిపై ట్రిపుల్‌ ఐటీ అధికారులు, ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. రెండురోజుల క్రితం పీయూసీ విద్యార్థి సంజయ్‌ కిరణ్‌ మృతి చెందిన ఘటన మరువకముందే.. బాసర ట్రిపుల్‌ ఐటీలో ఈవివాదంలో మళ్లీరాజుకుంది. వరంగల్‌ జిల్లా సంగెం మండలం ఎల్గూరు రంగంపేటకు చెందిన సంజయ్‌.. 2020లో బాసర ట్రిపుల్‌ ఐటీలో సీటు పొందాడు. సంజయ్‌ తల్లిదండ్రులు శ్రీధర్‌, శ్రీలత వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. వారిలో సంజయ్‌ చిన్న కుమారుడు. పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సంజయ్‌.. జూన్‌ 20న పరీక్షలు రాసేందుకు వెళ్లి, అక్కడ విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో పరీక్షలు రాయకుండానే స్వగ్రామానికి తిరిగొచ్చాడు.

నెలరోజులుగా అతడు జ్వరంతో బాధపడుతూ స్వగ్రామంలోనే ఉన్నాడు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించినా ఉపయోగం లేకపోయింది. ఆస్పత్రి ఖర్చులు ఎక్కువ అవుతుండడంతో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి, స్థానికంగానే చికిత్స అందించాలని తల్లిదండ్రులు భావించారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు సంజయ్‌ను తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. బాసర ట్రిపుల్‌ ఐటీలో చదువుతున్న శాబోతు సంజయ్‌కి ఫుడ్‌పాయిజనింగ్‌ కారణంగానే మరణించాడని.. అక్కడ భోజనం చేసిన నాటి నుంచే అనారోగ్యం బారిన పడ్డాడని కుటుంబసభ్యులు వాపోతున్నారు.

జూలై 16 న బాసర ఆర్జీయూకేటీలో మథ్యాహ్నభోజనం వికటించి 300 మంది విద్యార్థులు మరోసారి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.. సుమారు 1200 మంది విద్యార్థులు వాంతులు చేసుకోగా.. ఇందులో 300 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు, అస్వస్థతకు గురైన వారికి అక్కడే గుట్టుచప్పుడు కాకుండా చికిత్స అందించారు. ఈ విషయాన్ని మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. విషయం బయటకు రావడంతో విద్యార్తుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. బాసర ట్రిపుల్‌ ఐటీలోపల జరిగే సమాచారాన్ని ఎటువంటిదైనా సరే బయటకు రాకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. మీడియాకు లోనికి అనుమతించకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.తాజాగా వెలుగులోకి వచ్చిన ఫర్నిచర్ కొరతపై మంత్రి సబిత ఏమంటారో?