NTV Telugu Site icon

Shankersinh Vaghela: దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం ఉంది

Kcr Shanker Sinh

Kcr Shanker Sinh

Shankersinh Vaghela Meets CM KCR In Pragathi Bhavan: వర్తమాన జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరముందని గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు శంకర్ సింగ్ వాఘేలా పేర్కొన్నారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో కలిసిన ఆయన.. జాతీయ స్థాయి కీలక అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతితో పాటు దేశంలో నెలకొన్న వర్తమాన రాజకీయ పరిస్థితులపై మాట్లాడుకున్నారు. ప్రధాని మోడీ అనుసరిస్తున్న విచ్ఛిన్నకర పాలన, రాజకీయ విధానాలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోందని.. ఇటువంటి సందర్భంలో మౌనం వహించడం ప్రజాస్వామిక వాదులకు, దేశ ప్రగతి కాములకు తగదన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌తో శంకర్ సింగ్ వాఘేలా మాట్లాడుతూ.. ‘‘దేశంలోని ప్రజాస్వామిక ఫెడరల్ స్ఫూర్తిని మంటగలుపుతూ, ప్రస్తుతం కేంద్రంలో ఒక నియంతృత్వ ధోరణి ప్రబలుతోంది. దీన్ని ఇలాగే చూస్తూ ఊర్కోలేక.. నిలువరించే దిశగా సరైన వేదిక దొరక్క.. నాలాంటి సీనియర్లు ఆందోళన చెందుతున్నాం. ఇలాంటి తరుణంలో చీకట్లో చిరుదీపమై.. మీరు కేంద్ర విధానాల్ని ప్రతిఘటిస్తున్న తీరు నాలాంటి సీనియర్ నాయకుల్ని ప్రభావితం చేసింది. అనుకున్నదాన్ని సాధించేదాక పట్టువీడని నాయకుడిగా దేశం మిమ్మల్ని ఇప్పటికే గుర్తించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో కష్టనష్టాలకోర్చి.. పార్లమెంటరీ రాజకీయ పంథా ద్వారా సాధించడం దేశ చరిత్రలో గొప్ప విషయం. రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తూ.. అనతికాలంలోనే అప్రతిహతంగా ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. 75 ఏళ్ల భారతదేశ చరిత్రలో ఇంతటి ఘన చరిత్ర మీది మాత్రమే. తెలంగాణకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం, అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ మిమ్మల్ని ఇబ్బందులుకు గురి చేస్తున్నా.. మొక్కవోని పట్టుదలతో ముందుకు పోతున్న మీ తెగువ నిజంగా మహోన్నతమైనది. దేశంలోని ప్రతి విపక్ష రాష్ట్రాన్ని నియంతృత్వ ధోరణుల ద్వారా లొంగదీసుకునేందుకు కుట్రలు పన్నుతూ.. దేశంలో మత సామరస్యానికి విఘాతం కలిగిస్తున్న బీజేపీ పాలనకు వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడాల్సి ఉంది’’ అని చెప్పారు.

అంతేకాదు.. మీరు మీ అనుభవాన్ని కేవలం తెలంగాణకే పరిమితం చేయకుండా భారతదేశానికి విస్తరించాల్సిన సమయం వచ్చిందని శంకర్ సింగ్ వాఘేలా చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రత్యామ్న్యాయంగా ఉంటుందనుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతోందని, బీజేపీ దుర్మార్గాల్ని ఎదుర్కోవడానికి కావాల్సిన రాజకీయ వ్యూహాల్ని రచించడంలో విఫలమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని భావసారూప్య విపక్షాలను కలుపుకుపోయే మీలాంటి నాయకత్వం అవసరం ఉందన్నారు. మీ నాయకత్వంలో పనిచేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని, మా సీనియర్ నాయకులంతా చర్చించుకున్నాకే మీతో సమావేశం కావడానికి హైదరాబాద్ వచ్చానని పేర్కొన్నారు. మీకు మా అందరి ఔట్ రైట్ మద్దతు ఉంటుందని, మీరు జాతీయ రాజకీయాల్లోకి వచ్చి దేశ గతిని మార్చాలని కోరుతున్నామని, అందుకు జాతీయ రాజకీయాల్లో ఆహ్వానిస్తున్నామని శంకర్ సింగ్ వాఘేలా సీఎం కేసీఆర్‌తో పేర్కొన్నారు. ఈ ఆహ్వానానికి ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్.. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పును తేవడానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Show comments