Shamshabad Metro works: ఎయిర్‌పోర్ట్ మెట్రో పనులను వేగవంతం చేయడానికి సమాంతరంగా అనేక ముందస్తు నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయని, అవి శరవేగంగా సాగుతున్నాయని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. జనరల్ కన్సల్టెంట్ (జిసి) కోసం బిడ్‌ల సమర్పణకు ఈ నెల 20 చివరి తేదీ కాగా, ఈ నిపుణులైన ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు వచ్చే నెల మొదటి వారంలో నియమితులవనున్నారు. ఈలోగా మెట్రో అలైన్‌మెంట్ ను పక్కాగా సరిదిద్దడానికి, స్టేషన్ల స్థానాలను నిర్ణయించడానికి సర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. శాటిలైట్ ఆధారిత డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (DGPS) మరియు ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ అనే రెండు పద్ధతులు ఉపయోగించి, ఖచ్చితమైన కోఆర్డినేట్‌లను తెలుసు కోవడం కోసం సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌ల సాయంతో సర్వే పని జోరుగా జరుగుతోంది.
Read Also: South India Science Expo : సౌత్ ఇండియా సైన్స్ ఎక్స్‌పోకు ఎంపికైన ఖమ్మం విద్యార్థి
శంషాబాద్ పట్టణానికి సమీపంలోని ఫోర్ట్ గ్రాండ్ అండర్‌పాస్ వరకు ఇప్పటివరకు 21 కిలోమీటర్ల మేర సర్వే పూర్తయిందని..ఈ నెలాఖరులోగా మొత్తం సర్వే పూర్తి కానుందని, ఆ తర్వాత అలైన్మెంట్ ను తెలియజేసేలా పెగ్ మార్కింగ్ ప్రారంభిస్తామని ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు.
స్టేషన్ స్థానాలను గుర్తించడానికి ఢిల్లీ మెట్రో వారు తయారు చేసిన డీపీఆర్ మామూలు రైల్వే ఇంజనీరింగ్ పద్ధతిని అనుసరించగా, నానక్రామ్‌గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేటలలో గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన భారీ వాణిజ్య మరియు నివాస అభివృద్ధిని గుర్తించడం ద్వారా ఇప్పుడు ఒక వినూత్న విధానాన్ని అవలంబిస్తున్నామని ఆయన అన్నారు. నానక్ రాంగుడా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, నార్సింగి, రాజేంద్రనగర్, శంషాబాద్ వంటి ప్రాంతాల అభివృద్ధికి హెచ్ఎండీ మాస్టర్ ప్లాన్ ను ద్రుష్టి లో ఉంచుకొని, నగరాన్ని దాని శివార్లలోకి విస్తరించడం, పని ప్రదేశాలకు అరగంట కంటే తక్కువ ప్రయాణ దూరంలో సరసమైన ధరలకు గృహాలను అందించాలనే సిఎం కేసీఆర్ గారి దార్శనికతకు అనుగుణంగా ఎయిర్ పోర్ట్ మెట్రో ను రూపొందిస్తున్నామని ఎండీ పేర్కొన్నారు. ట్రాఫిక్ సర్వేలో స్థానిక ట్రాఫిక్ పోలీసు ఇన్‌స్పెక్టర్లను జతచేయడం వల్ల స్టేషన్ స్థానాలను సరిగా గుర్తించడంలోను, స్టేషన్ యాక్సెస్ సౌకర్యాలను తక్కువ ఖర్చుతో రూపొందించడం లోను మంచి ఫలితాలను ఇస్తోందని ఎన్‌విఎస్ రెడ్డి అన్నారు.