Site icon NTV Telugu

Special Trains : ఐటీ కారిడార్‌ ప్రయాణికులకు శుభవార్త..

Intercity Train Hyd

Intercity Train Hyd

Special Trains : సంక్రాంతి సందర్భంగా నగరంలో పెరిగే భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని, దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పండుగ సెలవుల్లో దూర ప్రాంతాలకు ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో, ఈసారి రైల్వే ప్రత్యేక హాల్ట్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

సాధారణంగా సికింద్రాబాద్‌–లింగంపల్లి మార్గంలో నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు హైటెక్‌సిటీలో ఆగవు. అయితే భారీ ప్రయాణికుల రద్దీని తగ్గించడమే కాకుండా, ఐటీ కారిడార్‌ పరిసరాల్లో నివసించే ప్రజలకు సౌకర్యం కల్పించేందుకు ఈ ఏడాది ప్రత్యేక చర్యలు చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 16 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హైటెక్‌సిటీ స్టేషన్‌లో ప్రత్యేక హాల్టింగ్‌‌ను ఏర్పాటు చేస్తోంది. దీంతో ఐటీ ఉద్యోగులు, పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రయాణికులు, సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే తమ రైళ్లను హైటెక్‌సిటీలోనే ఎక్కే వీలుంటుంది.

ఇది ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడమే కాకుండా, పండుగ సీజన్‌లో సికింద్రాబాద్‌, బేగంపేట, లింగంపల్లి స్టేషన్లలో ఏర్పడే రద్దీని కూడా తగ్గిస్తుంది. ఈ ప్రత్యేక హాల్ట్‌ సదుపాయం జనవరి 7 నుంచి 20 వరకు అమల్లో ఉంటుందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్‌ఓ శ్రీధర్‌ అధికారికంగా ప్రకటించారు. అవసరమైతే పరిస్థితులను పరిశీలించి ఈ సౌకర్యాన్ని మరింత కాలం కొనసాగించే అవకాశముందని ఆయన తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ప్రజలు ఇళ్లకు వెళ్లడానికి చేసే ప్రయాణం మరింత సులభంగా, సౌకర్యంగా మారేందుకు రైల్వే చేపట్టిన ఈ నిర్ణయం ప్రయాణికుల్లో సంతృప్తిని కలిగిస్తోంది.

ఇండియా తొలి ‘గియర్డ్ ఎలక్ట్రిక్ బైక్’ MATTER AERA 5000+ లాంచ్.. ధర ఎంతంటే..?

Exit mobile version