Sangareddy Raikode MRO Rajaiah Again Changed Land Details Of Mohan: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మాజీ ఎమ్మార్వో రాజయ్య గుర్తున్నాడా? గత నెల సెప్టెంబర్ 20న.. ధరణి పోర్టల్‌లో బతికున్న మహిళను చనిపోయినట్టు చిత్రీకరించి, ఆమె 27 ఎకరాల భూమిని మరొకరి పేరుపై ఆయన పట్టా రాశాడు. డబ్బుకి కక్కుర్తికి అలవాటు పడిన ఆయన.. ఆ మహిళ భూమిని కూడా దోచేయాలని చూశాడు. కానీ.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఇప్పుడు ఆయనకు సంబంధించి మరో బాగోతం బట్టబయలైంది. ఈసారి ఆయన బతికున్న యువకుడ్ని చనిపోయినట్టుగా చూపించి.. అతని భూమిని మరొకరిపై పట్టా చేసినట్టు వెలుగులోకి వచ్చింది.
ఆ యువకుడి పేరు మోహన్. రాయికోడ్ (మం) నాగ్వార్ గ్రామంలో సర్వే నెంబర్ ‘79/అ1’లో అతనికి 4.35 ఎకరాల భూమి ఉంది. కానీ.. ఈ సంవత్సరం జులైలోనే మోహన్ చనిపోయాడని ధరణి పోర్టల్‌లో ఆ మాజీ ఎమ్మార్వో మార్పులు చేసి.. సంగన్న అనే మరో వ్యక్తి మీద పట్టా చేశాడు. కులం వేరేది అయినప్పటికీ.. ఒకే కులంగా రాజయ్య చిత్రీకరించాడు. ఇన్నిరోజుల వరకు ఈ విషయం మోహన్‌కి తెలీదు. అయితే.. ఆర్థిక అవసరాల నిమిత్తం మోహన్ తన భూమిని అమ్ముదామని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ధరణి వెబ్‌సైట్‌లో తన పేరు మీదున్న భూమి వివరాల్ని సెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. కానీ, ఎక్కడా వివరాలు దొరక్కపోగా.. తాను చనిపోయినట్టు అందులో మెన్షన్ చేసి ఉండటం చూసి షాక్‌కి గురయ్యాడు. దాంతో.. ఎమ్మార్వో ఆఫీస్‌కి వెళ్లి, లబోదిబోమంటూ బాధితుడు తన ఆవేదన వ్యక్తం చేశాడు.
అంతకుముందు మహిళ కేసు గురించి మాట్లాడుకుంటే.. కరోనా కారణంగా భర్త హనుమంత రెడ్డి చనిపోవడంతో, ఈ ఏడాది ఏప్రిల్‌లో భర్త మీదున్న 27 ఎకరాల భూమిని భార్య శివమ్మ తన పేరుపై మార్చుకుంది. అయితే.. సెప్టెంబర్ 19న మాజీ ఎమ్మార్వో రాజయ్య ధరణి పోర్టల్‌లో ఆమెని మృతి చెందినట్టుగా చిత్రీకరించి, మరొకరి పేరుపై వివరాలను మార్చేశాడు. శివమ్మ పోర్టల్ ఓపెన్ చేయగా.. రాజయ్య బాగోతం బయటపడింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రాజయ్యపై చర్యలు తీసుకున్నారు.