Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!

  • ఆటోను ఢీకొట్టిన ట్యాంకర్
  • కూలీల కుటుంబాల్లో విషాదం
  • మూడు కార్లు ఢీ
  • ఆరుగురి పరిస్థితి విషమం
Accident

Accident

సంగారెడ్డి జిల్లా పరిధిలోని జాతీయ రహదారి 65 (NH 65) రక్తసిక్తమైంది. మంగళవారం చోటుచేసుకున్న వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఆటోను ఢీకొట్టిన ట్యాంకర్ లారీ.. కూలీల మృతి

మొగుడంపల్లి మండలం సత్వార్ గ్రామ శివారులో నేషనల్ హైవేపై యూ టర్న్ తీసుకుంటున్న ఒక ఆటోను వేగంగా వచ్చిన ట్యాంకర్ లారీ సడన్‌గా ఢీకొట్టింది. ఈ భయానక ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు విడిచారు. దీంతో ఈ ఒక్క ప్రమాదంలోనే మొత్తం ఏడుగురు మరణించగా, మరో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మృతులంతా కర్ణాటక రాష్ట్రంలోని రాజగిరా ప్రాంతానికి చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు. వీరంతా పొట్టకూటి కోసం తెలంగాణకు వచ్చి పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.

కవేలి వద్ద మూడు కార్లు ఢీ.. ఇద్దరు మృతి

మరొక ఘటనలో కోహిర్ మండలం కవేలి వద్ద జాతీయ రహదారి 65పై తీవ్ర ప్రమాదం జరిగింది. అతివేగంతో వస్తున్న మూడు కార్లు ఒకదానినొకటి వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కాగా, కార్లలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఒకే రోజు జాతీయ రహదారిపై జరిగిన ఈ రెండు ఘోర ప్రమాదాలతో స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనలపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.