Site icon NTV Telugu

RM Dobriyal: తెలంగాణ అటవీశాఖకు కొత్త సారథి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌ ఎం డోబ్రియల్ ను అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్)గా నియమించిది ప్రభుత్వం. తెలంగాణకు హరితహారం స్టేట్ నోడల్ ఆఫీసర్ గా గత ఆరేళ్లుగా పనిచేస్తున్నారు డోబ్రియల్. తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ కొత్త అధిపతిగా సీనియర్ ఐ.ఎఫ్.ఎస్ అధికారి రాకేష్ మోహన్ డోబ్రియల్ ఎంపికయ్యారు. ప్రస్తుతం పీసీసీఎఫ్ గా ఉన్న ఆర్. శోభ ఇవాళ్టితో పదవీ విరమణ పొందటంతో డోబ్రియల్ కు పీసీసీఎఫ్ గా, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ (HoFF) గా పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం డోబ్రియల్ సోషల్ ఫారెస్ట్రీకి పీసీసీఎఫ్ గా, తెలంగాణకు హరితహారం రాష్ట్ర నోడల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. హరితహారం విజయవంతంలో తనవంతు పాత్ర పోషించారు. అలాగే సీనియారిటీ ప్రకారం కూడా ముందున్నారు. దీంతో ఆయనకే పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ లాంఛనాల తర్వాత పూర్తి స్థాయి పీసీసీఎఫ్ గా ఆయన కొనసాగే అవకాశం ఉంది.

ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన డోబ్రియల్ 1987లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో చేరారు. ట్రైనింగ్ తర్వాత 1989లో పాల్వంచ సబ్ డీఎఫ్ఓగా మొదటి పోస్టులో అపాయింట్ అయ్యారు. ఆతర్వాత 1991 -94 దాకా భద్రాచలం డివిజనల్ ఫారెస్ట్ అధికారిగా పనిచేశారు. అదే హోదాలో 2002 వరకు వరంగల్, బెల్లంపల్లి డివిజన్లలో పనిచేశారు. కన్జర్వేటర్ గా పదోన్నతి పొందిన తర్వాత అడిషనల్ సెక్రటరీ హోదాలో సచివాలయంలో వ్యవసాయ శాఖ, ఉన్నత విద్యాశాఖల్లో వివిధ హోదాల్లో డిప్యుటేషన్ పై పనిచేశారు.

https://ntvtelugu.com/taapsee-mission-impossible-release-date-fix/

ఆ తర్వాత స్పెషల్ సెక్రటరీ హోదాలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా వివిధ యూనివర్సిటీలకు ఇంఛార్జి వైస్ ఛాన్సలర్ గా 2003-14 వరకు పనిచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2015 లో అదనపు పీసీసీఎఫ్ హోదాలో తిరిగి అటవీ శాఖలో చేరి, విజిలెన్స్, ఫారెస్ట్ ప్రొటెక్షన్ విధులు నిర్వహించారు. 2016లో తెలంగాణకు హరితహారం నోడల్ ఆఫీసర్ గా నియమితులై ఇప్పటిదాకా పనిచేశారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన హరితహారాన్ని విజయవంతం చేయటంలో, పచ్చదనం పెంపుకు అన్ని శాఖల సమన్వయంలో డోబ్రియల్ కీలకపాత్ర పోషించారు. 2020 లో పీసీసీఎఫ్ ర్యాంకు పొందిన ఆయన 2025 ఏప్రిల్ వరకు సర్వీసులో కొనసాగుతారు. పీసీసీఎఫ్ గా నియమితులైన డోబ్రియల్ ను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, పదవీ విరమణ పొందిన పీసీసీఎఫ్ ఆర్. శోభ, అటవీశాఖ ఉన్నతాధికారులు, స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్, రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్, జూనియర్ ఆఫీసర్ల సంఘం, సిబ్బంది అభినందించారు.

Exit mobile version