CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం

  • ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌తో రేవంత్ భేటీ
  • వారసత్వ కట్టడాల పునరుద్ధరణకు విజ్ఞప్తి
  • ఫ్యూచర్ సిటీపై ఆగా ఖాన్ ఆసక్తి
  • తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
Cm Revanth

Cm Revanth

CM Revanth Reddy : హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు రామకృష్ణారావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు , ఆగా ఖాన్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇటీవల దివంగతులైన ప్రిన్స్ రహీమ్ తండ్రి ఆగా ఖాన్-IV మృతి పట్ల సీఎం సంతాపం తెలిపారు. హైదరాబాద్‌తో ఆగా ఖాన్ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, తెలంగాణ వారసత్వ సంపద పునరుద్ధరణలో ఫౌండేషన్ పోషిస్తున్న పాత్రను కొనియాడారు. శాసనమండలి భవనం, కుతుబ్ షాహీ టూంబ్స్ అభివృద్ధిలో ఫౌండేషన్ అందించిన సహకారాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

మూసీ పునరుజ్జీవనం, చారిత్రక భవనాల పునరుద్ధరణ

మూసీ నది పునరుజ్జీవనం ద్వారా నైట్ ఎకానమీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని సీఎం వివరించారు. ఈ పరివాహక ప్రాంతంలోని చారిత్రక ఆధారాలైన సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణకు ఆగా ఖాన్ ఫౌండేషన్ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా ఆసుపత్రికి గోషామహల్‌లో నూతన భవనం నిర్మిస్తున్నామని, ప్రస్తుతం ఉన్న పాత భవనాన్ని వారసత్వ సంపదగా గుర్తించి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పునరుద్ధరించాలని కోరారు.

భారత్ ఫ్యూచర్ సిటీపై ఆగా ఖాన్ ఆసక్తి

శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టుపై ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ తీవ్ర ఆసక్తి కనబరిచారు. దీనిని 15 వేల ఎకరాల గ్రీన్ జోన్‌తో నెట్-జీరో సిటీగా తీర్చిదిద్దుతున్నామని, సింగపూర్ కంపెనీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోందని సీఎం వెల్లడించారు. ఇప్పటికే అమెజాన్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించాయని వివరించారు. ఫ్యూచర్ సిటీలో ఆగా ఖాన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా ఈ సందర్భంగా ప్రతిపాదించారు.

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, దేశ జీడీపీలో రాష్ట్ర వాటాను 10 శాతానికి పెంచుతామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా డిసెంబర్ 7 నుంచి మూడు రోజుల పాటు భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహించనున్న ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు హాజరు కావాల్సిందిగా ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌ను ఆహ్వానించారు. 100కు పైగా దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రంలో విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో పెట్టుబడులు , భాగస్వామ్యాలకు విస్తృత అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.