TPCC President Revanth Reddy Outraged on TPCC working Prsident Jagga Reddy and OU Students Arrest.
ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఓయూ విద్యార్థులు నేడు మినిస్టర్స్ క్వాటర్స్ ముట్టడికి యత్నంచారు. ఈ నేపథ్యంలో ఓయూ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్టైన ఓయూ విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ని బంజారాహిల్స్ పోలీసులు నిర్బంధించడం పాశవిక పాలనకు పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ పర్యటన కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిస్తుందని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ కి వస్తామంటే అడ్డుకోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. నియంత రాజ్యంలో ఉన్నామా.. అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం అనుభవిస్తున్న భోగాలన్నీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్, సోనియా గాంధీ ల భిక్ష అని, కేసీఆర్ ఒక పిరికి పాలకుడు.. ఆయన పాలనకు మరో 12 నెలలు మాత్రమే గడువు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకున్నందుకు విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళను అరెస్ట్ చేయడం దారుణమని, వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
