Revanth Reddy Demands ED Raids on KCR Family Members: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వివిధ వ్యక్తుల ఇళ్లను సోదాలు చేసిన ఈడీ.. కేసీఆర్ కుటుంబీకుల నివాసాల్లో ఎందుకు తనిఖీలు నిర్వహించడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా ఇతర రాష్ట్రాలకు డబ్బులు వందల కోట్ల రూపాయలు కేసీఆర్ పంచారని ఆరోపణలు వచ్చినప్పుడు.. ఎందుకు విచారణ జరపడం లేదని నిలదీశారు. ఈడీ ఆలస్యం చేయడం వల్ల ఆధారాలు మాయం చేసే అవకాశం ఉందని.. ఎందుకు కేసీఆర్, ఆయన కుటుంబాన్ని కేంద్రం విస్మరిస్తోందని ఆయన మండిపడ్డారు. అటు.. వాసవి, సుమధుర, ఫీనిక్స్ గ్రూప్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ.. వాటికి సంబంధించిన వివరాల్ని ఎందుకు వెల్లడించడం లేదని గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి అడిగారు.
పంజాబ్‌లో ఎన్నికలు జరిగినప్పుడు కేసీఆర్ వెళ్లి కోట్లు పెంచి పెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎక్కడ ఎన్నికలు జరిగితే, అక్కడ కేసీఆర్ నిధులు పంపారని.. అక్రమ సంపాదనలో ఆయా రాజకీయ పార్టీలకు నిధులు ఇచ్చారని ఆయనన్నారు. వీటిపై కేంద్ర నిగ్గు తేల్చాలన్నారు. కేజ్రీవాల్‌ని కలిసి మాట్లాడినప్పుడు.. లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్‌కు తెలియదా? అని అడిగారు. బీజేపీ నేతలే విచారణ అధికారులుగా మారి ఆరోపణలు చేస్తున్నారని.. సీబీఐ ఎందుకు సమాచారాన్ని బయటకు చెప్పట్లేదని ఆగ్రహించారు. రికార్డులు ప్రగతి భవన్‌లో దాస్తే ఏం చేస్తారని అడిగారు. అసలు బీజేపీ లాలూచీ ఏంటి? అని ప్రశ్నించారు. 142 కోట్ల నగదు దొరికిన హీటిరో సంస్థపై ఎందుకు ఈడీ విచారణకి అదేశించలేదన్నారు. ఫీనిక్స్, వాసవి, సుమధుర సంస్థలు కేసీఆర్ బినామీ అని బీజేపీ ప్రచారం చేస్తోందన్నారు.
ఈడీ, సీబీఐలు బీజేపీకి అనుబంధ సంఘాలుగా మారిపోయాయని.. ఎన్నికలొస్తే చాలు, వాటిని బీజేపీ ముందుకు పంపుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యర్థుల్ని లొంగదీసుకొని.. ఎన్నికల్లో గెలవాలని బీజేపీ చూస్తోందని.. ఈడీ, సీబీఐలు బీజేపీ ఎన్నికల కమిటీగా మారాయని అన్నారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ మాత్రమే ఉన్నాయని చిత్రీకరించేందుకు ఆ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నారని ఫైరయ్యారు. కాంగ్రెస్‌ను దెబ్బ తీసేందుకు ఆ రెండు పార్టీలు కుమ్మక్కై.. కుట్రలు పన్నుతున్నాయని తెలిపారు. సురభి నాటకంలో రక్తి కట్టించినట్టు.. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు డ్రామాలు వేస్తున్నాయన్నారు. బలిదానం చేసి దేశ సమగ్రత కాంగ్రెస్ కాపాడితే.. బీజేపీ మాత్రం సమాజాన్ని నిట్ట నిలువునా చీల్చుతోందన్నారు.
దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్ రావుకి సంబంధించి డబ్బులు కోట్లలో పట్టుబడ్డాయని టీఆర్ఎస్ చెప్పిందని.. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదని రేవంత్ రెడ్డి చెప్పారు. డ్రగ్స్‌లో నా మేనల్లుడు ఉన్నాడన్నారు.. రక్త నమూనాలు తీయండంటే ఎవరు ఎందుకు ముందుకు రాలేదని ఆయన నిలదీశారు. ఇక ప్రియాంకా గాంధీ తెలంగాణపై ప్రత్యేక శ్రద్ద పెట్టారని.. పూర్తి సమయం ఇస్తామని చెప్పారని తెలిపారు. ఇక్కడి ప్రజల కష్టాలు.. తన కుటుంబ సమస్యగా ప్రియాంకా గాంధీ చూస్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
