Revanth Reddy Angry On Congress Party Office Fire Accident: మునుగోడు నియోజక వర్గంలోని చండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కొందరు దుండగులు దగ్ధం చేశారు. ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షలతోనే పార్టీ కార్యాలయం, ప్రచార సామగ్రిని దగ్ధం చేశారని మండిపడ్డారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ప్రత్యర్థులు తట్టుకోలేకపోతున్నారని.. అందుకే ఈ దుష్ట చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని.. లేకపోతే ఎస్పీ కార్యాలయం ముందు తానే స్వయంగా ధర్నా చేస్తానని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పార్టీ దిమ్మెలు కూల్చినా, పార్టీ కార్యాలయాలు తగలబెటినా.. మునుగోడు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని తేల్చి చెప్పారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలతో కాంగ్రెస్ గెలుపును ఎవ్వరూ ఆపలేరన్నారు. కాంగ్రెస్‌కి వస్తోన్న ఆదరణ చూసి బీజేపీ, టీఆర్ఎస్‌లకు వణుకు పుట్టిందన్నారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కై.. తమ క్యాడర్‌ని బెదిరించేందుకు కుట్ర పనుతున్నాయని ఆరోపణలు చేశారు. అయితే.. వారి బెదిరింపులకు తాము బెదిరేదే లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతామన్నారు.
కాగా.. హోరాహోరీ పోరు సాగుతున్న మునుగోడులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. సోమవారం రాత్రి చండూరులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం బీజేపీకి ఆయన అమ్ముడుపోయారని, Phone Pay తరహాలో Contract Pe అంటూ.. వందల సంఖ్యలో పోస్టర్లను గోడలపై అంటించారు. ఈ పోస్టర్లకు వెలిసిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్ కార్యాలయం దగ్ధం అవ్వడం.. సంచలనంగా మారింది.