NTV Telugu Site icon

Revanth Reddy: మోదీ తెలంగాణను, కేసీఆర్ దేశాన్ని ఆక్రమించేందుకు బయల్దేరారు

Revanth Reddy On Kcr Modi

Revanth Reddy On Kcr Modi

Revanth Reddy Again Fires On CM KCR and PM Narendra Modi: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ రెండు పార్టీలు కలిసి.. పార్టీ ఫిరాయింపుల కమిటీలను ఏర్పాటు చేసుకున్నాయని ఆరోపించారు. పోటీ పడి మరీ ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తూ.. ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తున్నాయని విమర్శించారు. రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం.. ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికే కోట్లాది రూపాయలను ఖర్చు చేసి, నేతలను అంగడి సరుకుగా మార్చేశాయన్నారు. మునుగోడులో నేతల జేబులు నిండాయి తప్ప.. ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆగ్రహించారు. ఇక మునుగోడ ఉప ఎన్నిక కోసం తాము సెప్టెంబర్ 1వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపడుతామని.. గ్రామగ్రామానికి ఇన్ఛార్జీలను నియమించి, ఇంటింటికి ప్రచారం చేస్తామన్నారు.

తెలంగాణ మోడల్ అని సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటుంటారని.. భూదోపిడీ, అవినీతే తెలంగాణ మోడలా? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గాల్వన్ లోయలో చనిపోయిన సైనికులకు పరిహారం ఇస్తానంటూ కేసీఆర్ వేరే రాష్ట్రానికి వెళ్తున్నారని.. మరి తెలంగాణ నుంచి ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాల పరిస్థితి ఏంటి? అని నిలదీశారు. ఇతర రాష్ట్రాల వారికి ఇచ్చే ప్రాధాన్యత తెలంగాణ వారికి ఇవ్వరా? అని అడిగిన రేవంత్ రెడ్డి.. తన సొంతం ఇమేజ్ పెంచుకోవడం కోసం తెలంగాణ ప్రజల సొమ్ముని ఢిల్లీ, పంజాబ్, బీహార్ రాష్ట్రాలకు కేసీఆర్ దోచి పెడుతున్నారని ఆరోపించారు. ఇక బీజేపీ నేతలు చెబుతున్న గుజరాత్ మోడల్ అంటే.. మత విద్వేషాలు, ఆస్తులు విధ్వంసం చేయడమేనని ఆయనన్నారు. తెలంగాణను ఆక్రమించడానికి ప్రధాని మోదీ.. దేశాన్ని ఆక్రమించడానికి సీఎం కేసీఆర్ బయలుదేరానని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

ఇదే సమయంలో.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన గులాం నబీ ఆజాద్‌పై కూడా రేవంత్ విమర్శలు గుప్పించారు. రాజ్యసభ సీటు రెన్యువల్ కాలేదన్న ఉద్దేశంతోనే ఆయన పార్టీ వీడారని చెప్పారు. ప్రధాని మోదీకి గులాం నబి ఆజాద్ గులాంగా మారారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతలు పార్టీ మారుతూ అనవసర విమర్శలు చేస్తుంటారని, అలాంటి వాళ్లని పట్టించుకోకూడదని అన్నారు. ఆజాద్‌కు కాంగ్రెస్‌ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.. గుజరాత్ జరిగిన నరమేథాన్ని ఆజా మర్చిపోయారా? అంటూ నిలదీశారు.