Reactor Blast At Nalgonda One Dead Eight Injured: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు పరిధిలో ఉండే హిందీస్ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బాల్కడ్రగ్స్ తయారు చేసే ఈ పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా పేలింది. దీంతో, కార్మికులందరూ బయటకు పరులుగు తీశారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ప్రొడక్షన్ మేనేజర్ కూడా ఉన్నాడని సమాచారం. గాయపడిన వారిని వెంటనే నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. డీ బ్లాక్‌లో రియాక్టర్ పేలినట్టు గుర్తించిన యాజమాన్యం.. కంపెనీ దగ్గరికీ ఎవ్వరినీ అనుమతించడం లేదు.
ఈ ప్రమాదం కారణంగా పరిశ్రమ చుట్టూ పెద్ద ఎత్తున మంటలు, పొగ వ్యాపించడంతో.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్రిమాపక సిబ్బంది.. సంఘటన స్థలానికి చేరుకొని, 10 ఫైరింజన్ల సహాయంతో 2 గంటల పాటు శ్రమించి, మంటల్ని ఆర్పేశారు. ఈ ప్రమాదంతో వెలిమినేడు, పిట్టంపల్లి, బాంగోని చెర్వు, పేరేపల్లి, గుండ్రంపల్లి, పెద్దకాపర్తి సమీప గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
