Raja Singh: ఓబీసీ నేత నరేంద్రమోదీని ప్రధానమంత్రిని చేసిన ఘనత బీజేపీదే అని బీజేపీ శాసనసభ్యులు రాజాసింగ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్.. బీసీ ద్రోహుల పార్టీలు అని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కాకుండా ఆ పార్టీలు కుట్రలు చేస్తున్నాయన్నారు. బీసీలను సీఎం చేస్తామని బీజేపీ చెబుతుంటే… కులం కంటే గుణం ముఖ్యమని ఒకరు, కుల గణన పేరుతో మరొకరు మాట్లాడుతూ బీసీ సీఎం నినాదాన్ని నీరుగార్చే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలను అడుగడుగునా అవమానిస్తున్నారని తెలిపారు. 50 శాతానికిపైగా జనాభా ఉన్న ఓబీసీలంతా తమ దమ్ము చూపే సమయం వచ్చింది. తెలంగాణలోని బీసీలంతా ఆ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాలి. బీసీలంతా ఏకమై ఎన్నికల్లో ఆ పార్టీలను ఓడించి తెలంగాణ పొలిమేరల దాకా తరిమి తరమి కొట్టాలని కోరుతున్నానని తెలిపారు. బీసీలపట్ల రాహుల్ గాంధీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించే దమ్ముందా? అని ప్రశ్నించారు. బీసీల పట్ల ప్రేమ ఒలకబోస్తున్న కేసీఆర్, కేటీఆర్ లకు బీసీని సీఎం చేస్తామని ప్రకటించగలరా? అని సవాల్ విసిరారు.
కనీసం కల్వకుంట్ల కుటుంబ సభ్యులెవరూ సీఎం పదవి చేపట్టబోరని, ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని అర్హులైన నాయకుడికి సీఎం పదవి ఇస్తామని చెప్పే సత్తా ఉందా? అని రాజాసింగ్ సవాల్ విసిరారు. బీసీలపట్ల నిజమైన ప్రేమ, చిత్తశుద్ధి ఉన్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. సామాన్య కుటుంబం నుండి వచ్చిన ఓబీసీ నేత నరేంద్రమోదీని ప్రధానమంత్రిని చేసిన ఘనత బీజేపీదే అన్నారు.. 27 మంది ఓబీసీలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించిన రికార్డు బీజేపీదే. దళిత, గిరిజన, మైనారిటీ నేతలను రాష్ట్రపతి చేసిన చరిత్ర బీజేపీదే అన్నారు. బీజేపీని విమర్శించే నైతిక అర్హత కాంగ్రెస్ కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, నియంత, కుటుంబ పాలనను ఎప్పటికప్పుడు ఎండగడుతూ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించిన పార్టీ బీజేపీ అన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడం తథ్యమని తెలిపారు. బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేయడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలంతా వాస్తవాలు ఆలోచించి ఎన్నికల్లో తగిన తీర్పు ఇవ్వాలని విజ్ఝప్తి చేస్తున్నానని తెలిపారు.
Israel Hamas War: ఇజ్రాయెల్ యుద్ధంలో యారో మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్.. ఈ హమాస్ మటాషే
