Rajagopal Reddy Sold His Munugodu Votes To PM Modi Says Revanth Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ప్రజలు 97 వేల ఓట్లు వేశారని.. ఆ ఓట్లకు ప్రధాని మోదీకి రూ. 22 వేల కోట్లకు అమ్ముకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే.. ఒక్కో ఓటుకు రూ. 2 లక్షల ధర పలికిందని అన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల ఊర్లకు రోడ్లు వచ్చాయా..? డబుల్ బెడ్‌రూం ఇల్లు వచ్చిందా..? అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు (మునుగోడు ప్రజల్ని ఉద్దేశించి) ఓటేసి గెలిపించిన ఎంపీటీసీ, సర్పంచులకు కూడా రూ. 40 లక్షలు వస్తున్నాయని కుండబద్దలు కొట్టారు. అమ్ముడుపోయిన వాళ్లకు డబ్బులు వచ్చాయని కానీ.. ప్రజలకు ఏం వచ్చిందని అడిగారు. సర్పంచ్‌లు రాజీనామా చేస్తే, గ్రామాలకు నిధులొస్తాయన్న ఆయన.. అమ్ముడుపోయిన నాయకుడు ఎవరైనా మీ ఊరికి వస్తే, పొరకలతో కొట్టండని పిలుపునిచ్చారు. బీజేపీకి అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డికి ఓట్లు వేయొద్దని మునుగోడు ప్రజల్ని ఆయన విజ్ఞప్తి చేశారు. మునుగోడులో 97 వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని, అందరం కలిసి పని చేస్తే ఎవర్నైనా పడగొట్టని రేవంత్ చెప్పారు. మండల స్థాయి నాయకులు రోజుకు రెండు గంటలు చొప్పున సమయం కేటాయిస్తే.. విజయం కాంగ్రెస్‌దేనని నమ్మకాన్ని వెలిబుచ్చారు. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలను కల్పించిందని, కానీ ఆయన వేరే పార్టీకి అమ్ముడుపోయారని మండిపడ్డారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ది పొందాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు.
ఇదే సమయంలో.. కమ్యూనిస్టులపై రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. వాళ్లను చూస్తుంటే జాలి వేస్తోందని అన్నారు. టీఆర్ఎస్‌కి మద్దతు ఎందుకని ప్రశ్నిస్తే, బీజేపీని ఓడించడం కోసమని కమ్యూనిస్టు వాళ్లు చెప్తున్నారని.. మరి బీజేపీని నల్గొండలో కాలు పెట్టకుండా చేసింది కాంగ్రెస్ కాదా? అని ఆయన నిలదీశారు. దేవరకొండలో మీ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. మీ ఎమ్మెల్యేని కొనుక్కున్నది కూడా టీఆర్ఎస్ పార్టీనే కదా..? మీ పార్టీని బొంద పెట్టి, ఊరు బయట స్థూపం పెట్టిన వాడికి మద్దతు ఇస్తారా..? అంటూ రేవంత్ రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీని అడిగారు. ఖమ్మంలో, కరీంనగర్‌లో ఉండే కమ్యూనిస్ట్ వాళ్లు ఏమైనా చేసుకోండని చెప్పిన రేవంత్ రెడ్డి.. మునుగోడులో ఉండే కామ్రేడ్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండని కోరారు.
ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. హైదరాబాద్ స్టేట్‌ను భారతదేశంలో విలీనం చేయడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర కీలకమైందన్నారు. ఈ ప్రాంత ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నారంటే.. అందుకు ఎంతోమంది ప్రాణత్యాగం పోరాటం ఉందన్నారు. పెద్దల పోరాటాన్ని త్యాగాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సెప్టెంబర్ 17ను ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం రూ. 5 వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17న ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించని టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు బిజెపి ఎక్కడుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రాన్ని.. అలాగే నిజాం ప్రభువు నుంచి విముక్తి కల్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించింది ఒక్క గాంధీ కుటుంబం మాత్రమేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
