Site icon NTV Telugu

Komatireddy Rajagopal Reddy: డబ్బు కోసం పార్టీ మారలేదు

Rajagopal Reddy On Gutha

Rajagopal Reddy On Gutha

Rajagopal Reddy Counter To Gutha Sukender Reddy Comments: కాంగ్రెస్ పార్టీతో పాటు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. మూడో దశ ప్రజా సంగ్రామ యాత్రలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. మర్యాదపూర్వకంగా బండి సంజయ్‌ను లంచ్ టైంలో కలిశానన్నారు. మునుగోడుకు సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, వాటిని దృష్టిలో పెట్టుకొని బండి సంజయ్ పాదయాత్ర రూట్ మ్యాప్ మార్చుకుంటే బాగుంటుందని సూచించానని అన్నారు. 21వ తేదీన చౌటుప్పల్‌లో అమిత్ షా బహిరంగ సభ ఉంటుందని, అందుకు భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించామని వెల్లడించారు.

ఇక ఇదే సమయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని తన గురించి వ్యాఖ్యలు చేస్తే బాగుంటుందని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తానేమీ పదవులు, డబ్బుల కోసమే పార్టీ మారలేదన్నారు. పార్టీలు, కండువాలు మార్చిన చరిత్ర గుప్తా సుఖేందర్ రెడ్డిదంటూ ఘాటుగా స్పందించారు. తనపై వ్యాఖ్యలు చేయడానికి ముందు గుత్తా సుఖేందర్ ఎన్ని పార్టీలు మారారో గుర్తు చేసుకోవాలన్నారు. ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారరని గుర్తు చేశారు. తన నిజాయితీ, నిబద్ధతను శంకించే స్థాయి గుత్తా సుఖేందర్‌రెడ్డికి లేదని ఎద్దేవా చేశారు. కాగా.. ఈనెల 21న నిర్వహించనున్న బహిరంగ సభలోనే రాజగోపాల్‌రెడ్డి కమలతీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డితోపాటు ఆయన అనుచరులు కూడా బీజేపీలో చేరనున్నారు.

Exit mobile version