Raikode MRO Rajaiah Changed Land Details Of Old Lady In Dharani Portal: సంగారెడ్డిలోని రాయికోడ్ ఎమ్మార్వో రాజయ్య నిర్వాకం బట్టబయలైంది. బతికే ఉన్న మహిళను చనిపోయినట్టుగా చిత్రీకరించి.. 27 ఎకరాల్ని కొట్టేయాలని పక్కా స్కెచ్ వేశాడు. ధరణి పోర్టల్‌లో పట్టాదారు చనిపోయారని మెన్షన్ చేసి, ఆమె భూమిని మరొకరి పేరుపై బదలాయించాడు. అంతేకాదు.. సర్వే నంబర్‌ని సైతం ఎవరూ చూడకుండా ప్రైవసిలో పెట్టాడు. చివరికి ధరణి పోర్టల్‌లో చెక్ చేయగా.. ఆ ఎమ్మార్వో అడ్డంగా బుక్కయ్యాడు.
నాగన్‌పల్లిలో 198 సర్వే నెంబర్‌లో హనుమంత్ రెడ్డికి 27 ఎకరాల భూమి ఉంది. ఆయన 2021 ఏప్రిల్‌లో కరోనాతో చనిపోయాడు. దీంతో.. ఈ ఏడాది ఏప్రిల్‌లో తన భర్త మీదున్న ఆ భూమిని తన పేరుపై మార్చుకుంది భార్య శివమ్మ. అయితే.. ఆ భూమిపై కన్నేసిన ఎమ్మార్వో రాజయ్య, ఈనెల 19వ తేదీన బతికున్న శివమ్మని మృతి చెందినట్టుగా చిత్రీకరించి, ధరణి పోర్టల్‌లో మరొకరి పేరు మీద వివరాలన్నీ మార్చేశాడు. ఈ రోజు ధరణి పోర్టల్‌లో తన భూమి వివరాలు పరిశీలిస్తుండగా.. తన పేరుపై ఉండాల్సిన భూమి, మరొకరి పేరు మీద ఉండటాన్ని శివమ్మ గమనించింది. అంతేకాదు.. అందులో తాను చనిపోయినట్టుగానూ ఉండటం చూసి ఖంగుతింది.
దాంతో.. శివమ్మ వెంటనే కలెక్టర్‌కి ఫిర్యాదు చేసింది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించగా.. కలెక్టర్ ఆదేశాలతో రాయికోడ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ భూమి విలువ రూ. 27 కోట్లు ఉంటుందని శివమ్మ పేర్కొంది. నాగన్‌పల్లిలో ఈ భూమి ఉందని, గతేడాది తన భర్త చనిపోవడంతో తన పేరు మీద పట్టా చేసుకున్నానని వాపోయింది. తనకు పాస్ బుక్ కూడా వచ్చిందని.. ఇప్పుడు తాను చనిపోయినట్టు చిత్రీకరించి, ఆ భూమిని వేరే వాళ్ల పేరు మీద పట్టా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.