Site icon NTV Telugu

Rahul Gandhi: మోడీ, కేసీఆర్ రైతులపై దాడి చేశారు

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi Fires On Modi KCR In Jodo Yatra Meeting: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లపై ధ్వజమెత్తారు. తన భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రస్తుతం తెలంగాణలో పర్యటిస్తున్న ఆయన.. మోడీ, కేసీఆర్ ఇద్దరూ రైతులపై దాడి చేశారని విరుచుకుపడ్డారు. ఈ జోడో యాత్రలో తాను ప్రతి రోజు 7 నుంచి 8 గంటల వరకు నడుస్తున్నానని.. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నానని అన్నారు. అన్ని వర్గాల వారిని తాను కలిశానని.. అయితే ఏ ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఆనందంగా లేరన్నారు. తనతో పాటు కాంగ్రెస్ నాయకులంతా ఈ యాత్రలో నడుస్తున్నారని.. వర్షం వచ్చినా, ఎండ కొట్టినా ఈ యాత్ర ఆగదని తేల్చి చెప్పారు. ఏ యువకుడ్ని కదిలించినా.. తాను నిరుద్యోగి అని చెప్తూ, బాధ పడుతున్నారని పేర్కొన్నారు.

2014 తర్వాత మన భారతదేశంలో నిరుద్యోగ సమస్య, దరిద్రం రెండూ గణనీయంగా పెరిగిపోయాయని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. చిన్న, సన్నకారు వ్యవస్థలే చాలా మందికి ఉపాధిని కల్పిస్తాయని.. అయితే 2014 తర్వాత కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ వచ్చాక ఉద్యోగాలిచ్చే రంగాలపై దాడి చేశారని ఆరోపించారు. మోడీ నోట్ల రద్దు చేసి, అందరి వెన్ను విరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను కూడా వాళ్లిద్దరు దారుణంగా మోసం చేశారన్నారు. తన జోడో యాత్రలో తాను ఎంతోమంది రైతులతో మాట్లాడానని, తెలంగాణలో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా తయారైందని వెల్లడించారు. అంతకుముందు.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఆయన మాట్లాడుతూ, ఆ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలూ రెండూ ఒక్కటేనని.. అవి దోచుకునే పనిలో ఉన్నాయని విమర్శలు గుప్పించారు.

Exit mobile version