Site icon NTV Telugu

Cyber Fraud: తల నొప్పిగా మారిన సైబర్ మోసాలు.. ఫిర్యాదుకు ప్రత్యేక హెల్ప్‌లైన్

Cyber Fraud

Cyber Fraud

Cyber Fraud: ఇటీవలి కాలంలో రోజుకో కొత్త తరహా సైబర్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది స్కామర్లు సులభంగా డబ్బు సంపాదించడానికి మోసాలబాట ఆశ్రయిస్తున్నారు. అమాయక ప్రజల విశ్వాసాన్ని మాయమాటలతో దోచుకుంటున్నారు. బహుమతులు, కేవైసీ అప్ డేట్, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, ఓఎల్ ఎక్స్, లాటరీల పేరుతో మోసం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో మహిళలు పోస్ట్ చేసిన ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి వేధిస్తున్నారు. ప్రొఫైల్‌లను డౌన్‌లోడ్ చేయడం, వాటిని అసభ్యకరంగా మార్చడం మరియు ఇతర సైట్‌లు, గ్రూప్‌లలో పోస్ట్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది స్కామర్లు డేటింగ్ సైట్లలో ఫోటోలు, ఫోన్ నంబర్లు మరియు ఇతర వివరాలను ఉంచి మహిళలను మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొన్ని మ్యాట్రిమోనీ సైట్లు కూడా సైబర్ నేరగాళ్ల వేధింపులకు గురవుతున్నాయి.

Read also: Beer bottle: మీర్‌ పేట్‌లో దారుణం.. బీర్ బాటిల్ కోసం హత్య..!

హనీ ట్రాప్ ద్వారా వృద్ధులు, యువతను టార్గెట్ చేస్తున్నారు. న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. బాధితుల కోసం పోలీసులు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. ఇలాంటి నేరాలపై రాచకొండ భద్రతా మండలి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ వెల్లడించారు. నేరస్థులు మిమ్మల్ని వేధిస్తే, వెంటనే పోలీసులకు లేదా ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ 8712662662కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి మెసేజ్ లు, కాల్స్ వస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెలియని అంతర్జాతీయ కాల్‌లను తీసుకోవద్దు. విదేశీ కోడ్ నంబర్ల ద్వారా కొందరు మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. స్పామ్ కాల్స్, మెసేజ్ లను వెంటనే బ్లాక్ చేయాలని సూచించారు. అత్యాశతో డబ్బు పోగొట్టుకోవడం కంటే అప్రమత్తంగా ఉండటమే ముఖ్యమన్నారు. అవసరమైతే అలాంటి కాల్స్‌, మెసేజ్‌లపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Apple iPhone:ఓల్డ్ ఈజ్ గోల్డ్.. రూ.1.5 కోట్ల ధర పలికిన పాత ఐఫోన్..రికార్డ్ బ్రేక్స్..

Exit mobile version