Police Command Control Center: హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఆగస్టు 4న కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభానికి ముందే సీపీ సీవీ ఆనంద్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. బంజారాహిల్స్ లో నిర్మితమవుతున్న ఈ భవనాన్ని శనివారం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు. నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే తొలిసారిగా అన్ని శాఖలను అనుసంధానం చేస్తూ అత్యాధునిక టెక్నాలజీతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను అధికారులు నిర్మించారు.
Read Also: Minister KTR: నా కాలికి గాయమైంది.. మంచి ఓటీటీ షోలు ఉంటే చెప్పండి
కాగా హైదరాబాద్ నగరంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మరో కలికితురాయిగా చేరనుంది. ఏ సమయంలోనైనా, ఎక్కడైనా ఏం జరిగినా క్షణాల్లో పసిగట్టే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి రానుంది. కాగా హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్ ప్రపంచస్థాయి కట్టడాల్లో ఒకటిగా నిలవనుందని ఇటీవల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదొక అద్భుత నిర్మాణంగా అభివర్ణించిన ఆయన.. దుబాయ్‌కి బూర్జ్ ఖలీఫా, ప్యారిస్‌కు ఈఫిల్ టవర్ ఎలాగో.. హైదరాబాద్‌కు కమాండ్ కంట్రోల్ సెంటర్ అంతటి కీర్తిని తెస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ 14వ అంతస్తు నుంచి చూస్తే.. హైదరాబాద్ నగరం నలువైపులా కనిపిస్తుందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే.