Site icon NTV Telugu

Polala Amavasya: శ్రావణ మాసానికి వీడ్కోలు.. ఆదివాసీ గూడెల్లో కాడెద్దుల వేడుకలు

Poalal Amavsya

Poalal Amavsya

Polala Amavasya celebrations in Adilabad: శ్రావణ మాసంలో ప్రతి రోజు ప్రత్యేకమే. ఈ మాసంలో భక్తులు నిష్టతో భక్తి శ్రద్దలతో ఒక్కపొద్దును పాటిస్తారు. అయితే ఈ శ్రావణ మాసం ప్రకృతితో మమేకమైన జిల్లా ఆదిలాబాద్‌లో వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రావణ మాసం ప్రారంభం నుంచి ముగిసే వరకు ఆదిలాబాద్‌లోని సామాన్యులు నిత్యం పూజలు, కైంకర్యాలు నిర్వహించి బసవన్నలకు పూలమాలలు వేస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసం చివర వచ్చే అమావాస్యను మరింత భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనవాయితీ. ఏడాది పాటు కష్టపడి పంటలు పండించే అన్నదాతలకు అండగా నిలిచిన బసవన్నలను కొలిచే పండుగ పొలాల అమావాస్య. ఈ రోజున జరిగే వేడుకను కడెద్దుల పండుగ, బసవన్న పండుగ, ఎడ్ల పండుగ, పొలాల పండుగ అని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు.

అయితే ఈ శ్రావణ మాసానికి వీడ్కోలు చెప్పే అమావాస్య రోజు.. తరతరాలుగా రైతులకు వ్యవసాయ పనుల్లో అన్ని కాలాల్లో అండగా నిలిస్తున్న ఎడ్ల రుణాన్ని తీర్చుకోవడానికి రైతులు ఏడాదికి ఓ‌సారి ముచ్చటగా జరుపుకునే పండుగ ఈ పోలాల అమావాస్య. ఈ..శ్రావణ బహుళ అమావాస్య నాడు ఈ పండుగను తెలంగాణలో ఘనంగా జరుపుకుంటారు. అడవుల జిల్లాగా ప్రసిద్ది చెందిన ఆదిలాబాద్ లో మరింతగా అంగరంగ వైభవంగా ఈ పోలాల అమావాస్యను జరుపుకుంటారు. ఎడ్లను ఒక్క రోజు ముందే బరువులు దింపే కార్యక్రమం చేస్తారు. ఈ ఏడాది పొడుగునా కష్టపడే బసవన్నకు పోలాల అమావాస్య ముందు రోజు సెలవు ఇవ్వడమే కాకుండా.. ఎలాంటి బరువులు మేపకుండా చూసుకుంటారు. అంతేకాకుండా రైతన్న కాడెద్దులను అమావాస్య తెల్లవారు జామున వాగుకు సమీపంలోని నది వద్దకు తీసుకు వెళ్లి స్నానం చేయిస్తారు. కుంకుమ బొట్లతో అలంకరించి నందీశ్వరుడిగా.. బసవేశ్వరుడిగా కొలిచి పూజలు చేస్తారు.

అయితే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులతో పాటు సరిహద్దు మహరాష్ట్రలో మరాఠ సాంప్రదాయాలతో పోలాల అమావాస్యను పురన్ పోలీ పండుగగా జరుపుకుంటారు. ఇక తరతరాలుగా అన్నదాతకు అండగా నిలుస్తూ.. కష్ట సుఖాల్లో సగభాగం పంచుకుంటూ శ్రమిస్తున్న కష్టజీవులైన ఈ ఎద్దులని కుటుంబ సభ్యుడిగా బావించి జరుపుకునే పండుగే ఈ పోలాల అమావాస్య పండుగ. కాగా.. దుక్కుల నుండి చివరకు పంట చేతికి వచ్చే వరకు.. ఆ వచ్చిన పంటను మార్కెట్ కు చేర్చే వరకు రైతన్న బరువు బాధ్యతలు మోసే బసవుడికి ఓ రోజు సెలవు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో పెద్దలు పెట్టుకున్న ఆచారమే ఈ పోలాల పండుగ అంటారు రైతులు. ఎడ్లను ఘనంగా ముస్తాబు చేసి.. కొమ్ములకు రంగులు వేసి రంగురంగుల బట్టలతో అలంకరించి అందంగా తీర్చి దిద్ది ముస్తాబు చేయడం ఆనవాయితీ…అలా ముస్తాబు చేసిన ఎడ్లను గ్రామంలో హనుమండ్ల ఆలయానికి తీసుకొచ్చి హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు.

అంతేకాకుండా.. ఆదివాసీ గ్రామాల్లొల పోలాల సందర్భంగా చేసే ప్రత్యేక వంటకం పురన్ పోలీ. ఈ పురన్ పోలీ అనేది మరాఠి పదం. వీటిని తెలుగు ప్రజలు దీనినే బూరేలు అని అంటారు. పోలాల పండుగ రోజు ఎద్దుల జతలను శివుడి నందిగా భావించి నైవేద్యంగా బూరెలను పెట్టడం ఆనవాయితీ. ఇక జత ఎడ్లకు ఈ పిండి వంటలను నైవేద్యంగా పెట్టి వాటి ఆశీస్సులు తీసుకుంటారు రైతులు. పోలాల అమావాస్యను రైతన్నే కాదు.. ఆ ఇంటి ఆడపడుచులు కూడా ఈ వేడుకను సంబరంగా జరుపుకుంటారు. శ్రావణమాసం ఈనెలంత సౌభాగ్యం కోసం పూజలు చేసే ఆడపడుచులు.. శ్రావణ మాస ముగింపు అమావాస్య రోజు సౌభాగ్యంతో పాటూ సంతానం కోసం కూడా పూజలు చేస్తారు. అంతేకాదు పెళ్లై సంతానం లేని వారికి పోలాల అమావాస్య ఎంత ముఖ్యమో, సంతానం ఉన్న కుటుంబాలకు వారి యోగక్షేమాల కూడా అంతే ముఖ్యం అన్నది ఈ పోలాల పండుగ విశిష్టత. ఇంట్లోని మనుషులే కాదు పశువులు కూడా ఇంటి కుటుంబ సభ్యులే అన్నది శ్రావణ అమావాస్య, పోలాల పండుగ గుర్తు చేస్తుంది.
Etela Rajender: బీజేపీ కండువా వేసుకుంటే పథకాలు రావని బెదిరిస్తున్నారు.. ఈటల కీలక వ్యాఖ్యలు

Exit mobile version