Site icon NTV Telugu

PM Narendra Modi: తెలంగాణ ప్రజల జోలికొస్తే.. తాట తీస్తాం

Modi Speech

Modi Speech

PM Narendra Modi Speech At Begumpet BJP Meeting: తనని, బీజేపీని తిడితే తమకెలాంటి అభ్యంతరం లేదని.. కానీ తెలంగాణ ప్రజల్ని తిడతే మాత్రం తాట తీస్తామని ప్రధాని మోడీ హెచ్చరించారు. తెలంగాణను దోచుకున్న వాళ్లను విడిచి పెట్టేది లేదని తేల్చి చెప్పారు. అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందన్నారు. తలంగాణలో అవినీతిరహిత పాలనను అందించేందుకు బిజెపి సిద్ధంగా ఉందన్నారు. మోడీపై విమర్శలు చేసే వాళ్ళను బిజెపి కార్యకర్తలు పట్టించుకోవద్దని పిలుపునిచ్చారు. బేగంపేట్ ఎయిర్‌పోర్టులో నిర్వహించిన బీజేపీ సభలో మోడీ ఆ వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ కార్యకర్తలను కలవాలని బండి సంజయ్ చెప్పారని, తాను కార్యకర్తలకు అభినందనలు తెలిపేందుకు వచ్చానని మోడీ అన్నారు. కార్యకర్తలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ భారతమాత కోసం యుద్ధం చేస్తున్నారన్నారు. నిరాశలో పడ్డ తెలంగాణ సర్కార్.. బిజెపి కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపణలు చేశారు. తెలంగాణ పేరుతో అన్ని అనుభస్తున్నారు.. ఆ కుటుంబం ఒక్కటే ముందుకు వెళ్లింది.. తెలంగాణ వెనక్కి వెళ్లిందని సీఎం కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి మోడీ వ్యాఖ్యానించారు. ఇక్కడి టాలెంట్‌ను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని మండిపడ్డారు. అయితే.. ఎక్కడైతే చీకటి అలుముకుంటుందో, అక్కడ కమలం వికసిస్తోందని తెలిపారు. తెలంగాణలో కూడా చీకటిని పారద్రోలేందుకు కమలం వికసించి తీరుతుందని బల్లగుద్ది చెప్పారు.

మునుగోడు ప్రజలు బీజేపీపై చూపిన విశ్వాసాన్ని అభినందిస్తున్నానని, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మునుగోడుకి వచ్చిందని మోడీ అన్నారు. తెలంగాణలో త్వరలో సూర్యోదయం అవుతుందని ఈ ఉప ఎన్నికలు చాటి చెప్పాయన్నారు. బీజేపీ గెలిచిన రెండు సీట్లలో ఒకటి ఇక్కడే గెలిచిందని.. బీజేపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇక్కడి ప్రజలు బీజేపీతోనే ఉన్నారన్నారు. ఆ కారణంతోనే ఇప్పుడు లోక్‌సభలో 300 సీట్లు దాటాయన్నారు. ఐటీకి తెలంగాణ కొండ అని, అంధవిశ్వాసానికి ఈ సర్కారు పెద్ద పీట వేస్తోందని విమర్శించారు. మంత్రి మండలిలో ఎవరుండాలి? ఎవరిని తీసెయ్యాలనేది కూడా మూఢ నమ్మకాలతో సాగుతోందన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే.. బీజేపీ సర్కార్ రావాల్సిందేనన్నారు. ఫ్యామిలీ ఫస్ట్ అనే ప్రభుత్వం కాదు, పీపుల్స్ ఫస్ట్ అనే ప్రభుత్వం రావాలన్నారు.

అవినీతి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా యువత పోరాటం చేస్తోందని, పేదలను దోచే వారిని తాను వదిలిపెట్టనని మాటిస్తున్నానని మోడీ చెప్పారు. అవినీతిపరులు కూటమి కట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మోడీ, బీజేపీని తిట్టడం వల్ల తెలంగాణకు లాభం వస్తుందంటే.. ఇంకా తిట్టండని పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణలో పాజిటివ్ ఎజెండాతో వస్తుందని నమ్మకం వెలిబుచ్చారు. త్రిపుర, అస్సాం, హర్యానా బీజేపీ అధికారంలోకి వచ్చిందని.. ఒక్కసారి వస్తే ప్రజలు మళ్లీ మళ్లీ బీజేపీకే అధికారం కట్టబెడుతున్నారని తెలిపారు. తెలంగాణకు అవినీతి పాలన, కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించాలని మోడీ వెల్లడించారు.

Exit mobile version