తెలంగాణ బీజేపీలో స్తబ్దత బాగా… పేరుకుపోయిందా? దాన్ని వదలగొడితేనే… స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటగలమని రాష్ట్ర నాయకత్వం డిసైడైందా? అందుకోసం స్పెషల్ స్కెచ్‌లు సిద్ధం చేస్తోందా? కేడర్‌లో ఊపు ఉత్సాహం తీసుకు రావడం ద్వారా… తాను మాటలు కాదు, చేతల మనిషిని అని కొత్త అధ్యక్షుడు నిరూపించుకోవాలనుకుంటున్నారా? ఇంతకీ కొత్త ప్లానింగ్ ఏంటి? అందుకోసం జరుగుతున్న కసరత్తు ఏంటి? తెలంగాణ బీజేపీకి కొత్త సారథి వచ్చారు. ఇప్పుడాయన ముందున్న లక్ష్యం కూడా చిన్నదేం కాదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు మెయిన్ టాస్క్ అయితే… అంతకంటే ముందు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ట్రయల్ రన్. నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలంటే…. పార్టీకి పైపైన ఎమ్మెల్యేలు, ఎంపీల బలం కనిపిస్తున్నా…. క్షేత్ర స్థాయిలో మాత్రం ఇప్పటికీ పడుతూ లేస్తున్న పరిస్థితే. స్థానిక సంస్థల పరంగా అయితే… రాష్ట్రంలో కొన్ని చోట్ల అసలు పార్టీకి ప్రాతినిధ్యమే లేని పరిస్థితి. పైగా కొద్ది రోజుల నుంచి కేడర్ పూర్తి నిస్తేజంగా ఉందని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. ఈ క్రమంలో కొత్త అధ్యక్షుడి మీద ఆశలు, అంచనాలు ఎక్కువగా ఉన్నాయట పార్టీ సర్కిల్స్‌లో. ఆయన వాటిని రీచ్ అవ్వాలన్నా… తనను తాను నిరూపించుకోవాలన్నా… ముందు ఇన్నాళ్ళుగా పేరుకుపోయిన స్తబ్దతను ఛేదించాల్సి ఉంది. ఇప్పుడు అదే అతి పెద్ద టాస్క్ అంటున్నాయి రాజకీయ వర్గాలు.
స్థానిక సమస్యల మీద దృష్టిపెట్టి జోరుగా పోరాటాలు చేస్తే తప్ప…. ఆ జడత్వం వదలబోదని అంటున్నారు. ఇన్నాళ్ళ నుంచి…. ఏదో,… కేంద్ర పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు, అది కూడా నామ మాత్రంగా నిర్వహించి మమ అనిపించారన్న అభిప్రాయం బీజేపీ వర్గాల్లోనే ఉంది. అంతకు మించి… రాష్ట్రంలో పార్టీకి ఒక కుదుపు వచ్చే ప్రోగ్రామ్‌గాని, అందరి అటెన్షన్ బీజేపీ వైపునకు తిరిగే స్థాయి కార్యక్రమంగానీ ఇటీవలి కాలంలో ఏదీ జరగలేదు. ఇప్పుడిక స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో… దూకుడు ప్రదర్శించకుంటే… ట్రయల్ రన్‌లోనే ఫెయిల్ అవుతామన్న చర్చ జరుగుతోంది కాషాయ వర్గాల్లో. అటు పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు మాకు సవాల్ అంటోంది. సర్వ శక్తులు ఒడ్డి పోరాడతామని, సత్తా నిరూపించుకుంటామని గట్టిగా చెబుతున్నారు నాయకులు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా మాకు లోకల్ బాడీస్ ఎన్నికలు చాలా కీలకం అని స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. ఇకనుంచి ఆందోళన కార్యక్రమాలే ఎక్కువగా ఉంటాయని క్లారిటీగా చెబుతున్నారాయన. తాను సౌమ్యుడిని కాదని , తానేంటో చూపిస్తానని కూడా సవాల్ చేస్తున్నారు. తాను డమ్మీనో… లేక తనను ఉద్దేశించి అలా అంటున్న వారికి డాడీనో త్వరలోనే తెలుస్తుందని అంటూ తొడగొడుతున్నారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్.
అయితే.. అదంతా డైలాగ్స్‌కే పరిమితమా? లేక చేతల్లో ఉంటుందా అన్న సంగతి కాసేపు పక్కనబెడితే… తన స్టేట్‌మెంట్స్‌తో ఆయన కేడర్‌లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అయితే… ఇప్పటికింకా… కేడర్‌లో ఊపు, ఉత్సాహం అనుకున్న స్థాయిలో కనిపించడం లేదనేది విస్తృతాభిప్రాయం. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్ని ఒక్కసారిగా గేరప్ చేసే స్థాయి కార్యక్రమం తీసుకుంటే తప్ప…. ఇప్పుడున్న స్తబ్దత పోయే అవకాశం లేదని పార్టీ నేతలే అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యి… బూత్ నుంచి…. రాష్ర్ట స్థాయి వరకు పార్టీలో కదలిక వచ్చేలా ఏదన్నా.. కార్యక్రమం చేస్తే బాగుంటుందన్న చర్చ జరుగుతోందట తెలంగాణ బీజేపీ వర్గాల్లో. నాయకత్వం కూడా అలాంటి ప్రోగ్రామ్ కోసమే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజల్లో పార్టీ పట్ల మరింత విశ్వాసం కలిగేలా…. పార్టీ శ్రేణులు స్తబ్దత వీడి ఉరుకులు పెట్టేలా…. డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు కూడా తాను మాటల మనిషిని కాదు, చేతల మనిషిని అని ఎస్టాబ్లిష్ చేసేందుకు తహతహలాడుతున్నారట. పెదవి విరుస్తున్న పార్టీ ముఖ్య నేతల్లో కూడా మార్పు రావాలన్నా… పార్టీ నిర్ణయం మంచిదేనని నిరూపితం కావాలన్నా, స్థానిక ఎన్నికల్లో జనం బీజేపీకి జై కొట్టాలన్నా… కేడర్ రోడ్ల మీదకు వచ్చేలా కార్యక్రమాలను రూపొందించాలన్న డిమాండ్ పెరుగుతోంది తెలంగాణ బీజేపీ సర్కిల్స్‌లో. దీంతో… ఎలాంటి ప్రోగ్రామ్స్ తెర మీదికి రాబోతున్నాయి? కొత్త అధ్యక్షుడు ఎలా తనను తాను నిరూపించుకోబోతున్నారని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.
