రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2,322 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీ ప్రక్రియలో మరో కీలక దశ పూర్తయింది. ఈ పోస్టులకు సంబంధించిన ‘ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్’ను తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) రాసిన మొత్తం 40,423 మంది అభ్యర్థుల వివరాలను, వారు సాధించిన మార్కులతో సహా బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు బోర్డు ప్రతి దశలోనూ అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తోంది. సీబీటీ, కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ సర్వీసు వెయిటేజీ మార్కులపై ఆగస్టులోనే ఒక దఫా అభ్యంతరాలను స్వీకరించి, అభ్యర్థుల సందేహాలను బోర్డు నివృత్తి చేసింది. తాజాగా విడుదల చేసిన ప్రొవిజనల్ మెరిట్ జాబితాపైనా అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే తెలిపేందుకు మరోసారి అవకాశం కల్పించింది.
Recession: పేలిన భారీ బాం*బ్.. లక్షల మంది బలి.. 2026లో అంతకు మించిన విధ్వంసం?
అభ్యర్థులు నేటి (డిసెంబర్ 24) నుంచి ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు బోర్డు వెబ్‌సైట్‌లో లాగిన్ అయి తమ అభ్యంతరాలను నమోదు చేసుకోవచ్చు. అభ్యర్థుల నుంచి వచ్చే అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ‘సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్’ను విడుదల చేస్తామని, ఆ తర్వాత మెరిట్ ఆధారంగా 1:1.5 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలుస్తామని బోర్డు వెల్లడించింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం, ఉద్యోగాలకు ఎంపికైన వారి తుది జాబితాను విడుదల చేయనున్నారు.
ఇటీవలే 1260 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల నియామక ప్రక్రియను బోర్డు పూర్తి చేసింది. ఈ 1260 మంది ల్యాబ్ టెక్నీషియన్లతో పాటు, ఉద్యోగాలు ఎంపికయ్యే 2322 మంది నర్సింగ్ ఆఫీసర్లు కూడా జనవరిలోనే ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గతేడాది గతేడాది 7 వేలకు పైగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మరో 2322 పోస్టులను భర్తీ చేస్తున్నది. దీంతో ప్రభుత్వ హాస్పిటళ్లలో నర్సుల కొరత పూర్తిగా తీరిపోతుందని, అవసరానికి సరిపడా సిబ్బంది అందుబాటులో ఉంటారని డాక్టర్లు చెబుతున్నారు.
ఆరోగ్యశాఖలో గడిచిన రెండేళ్లలోనే 11 వేలకుపైగా పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇందులో 9 వేలకుపైగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, 600లకుపైగా డాక్టర్ పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తదితర పోస్టులు ఉన్నాయి. మరో 5 వేలకుపైగా పోస్టులు భర్తీ ప్రక్రియలో ఉన్నాయి. ఇందులో 1600లకుపైగా స్పెషలిస్ట్ డాక్టర్(సీఏఎస్ స్పెషలిస్ట్) పోస్టులు, 600లకుపైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 700లకుపైగా ఫార్మసిస్ట్ పోస్టులు, సుమారు 2 వేల వరకూ మల్టీ పర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
