Site icon NTV Telugu

Asif: రియాజ్ దాడిలో గాయపడ్డ ఆసిఫ్‌కు డీజీపీ పరామర్శ

Asif

Asif

Asif: నిజామాబాద్‌లో ఇటీవల చోటుచేసుకున్న సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ హత్య కేసులో ప్రధాన నిందితుడు రౌడీషీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందగా, అతన్ని పట్టుకునే క్రమంలో మరొక యువకుడు ఆసిఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసిఫ్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉండగా, ఆయన సాహసాన్ని ప్రశంసిస్తూ రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మంగళవారం నాంపల్లిలోని మల్లారెడ్డి ఆసుపత్రిలో ఆయనను పరామర్శించారు.

ఆసుపత్రిలో ఆసిఫ్‌ను కలసిన డీజీపీ శివధర్‌రెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుండి ఆరా తీశారు. డాక్టర్లు వివరించిన ప్రకారం ఆసిఫ్‌పై సర్జరీ పూర్తయిందని, ప్రస్తుతం ఆయన చేతి నరాలను సవ్యంగా కలిపి సాధారణ స్థితికి తీసుకురావడానికి చికిత్స కొనసాగుతున్నదని తెలిపారు. ఆసిఫ్ పరిస్థితి స్థిరంగా ఉందని డీజీపీ వెల్లడించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన డీజీపీ శివధర్‌రెడ్డి, “ఆసిఫ్‌ చాలా ధైర్యంగా, నిజమైన పోలీసు స్ఫూర్తితో వ్యవహరించాడు. నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో ఆయన చూపిన సాహసం ప్రశంసనీయం. ఆయన వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాదు, ఆసిఫ్ ధైర్యాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి గ్యాలంట్రీ మెడల్ కోసం సిఫార్సు చేస్తాం,” అని తెలిపారు.

నిందితుడు రియాజ్‌ చేసిన దాడిలో ఆసిఫ్‌ రెండు చేతులకు లోతైన కత్తిగాట్లు అయ్యాయి. చేతి నరాలు కోసుకుపోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. మొదట స్థానికంగా ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం మల్లారెడ్డి ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. డాక్టర్లు ఆసిఫ్‌పై సర్జరీ విజయవంతంగా పూర్తయిందని, కొద్ది వారాల్లో ఆయన కోలుకుంటారని తెలిపారు.

గత వారం జరిగిన ఈ ఘటనలో రౌడీషీటర్ రియాజ్‌ను నిజామాబాద్ పోలీసులు అక్టోబర్ 17న అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో అతను సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్‌పై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర గాయాల కారణంగా కానిస్టేబుల్ ప్రమోద్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర పోలీస్ శాఖ, నిందితుడిని పట్టుకునేందుకు పెద్ద ఎత్తున దాడులు చేపట్టింది. చివరికి రియాజ్‌ను పట్టుకునే క్రమంలో ఆసిఫ్ ధైర్యంగా ఎదుర్కొని తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం రియాజ్‌ను పట్టుకొని ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రియాజ్ మరోసారి పోలీసులు పై దాడికి పాల్పడి ఆయుధాలు లాక్కునేందుకు యత్నించాడు. ఆత్మరక్షణార్థం పోలీసులు జరిపిన కాల్పుల్లో రియాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత పోలీస్ శాఖలో ఆసిఫ్ సాహసానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఒక సాధారణ వ్యక్తి అయినా పోలీసుల మాదిరిగా ప్రమాదంలో పాల్గొని నిందితుడిని పట్టుకునేందుకు సాహసం చేసినందుకు ఆయనను రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారు. డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నట్లుగా, ఆసిఫ్ సాహసాన్ని గుర్తించి గ్యాలంట్రీ అవార్డుకు సిఫార్సు చేయడం ద్వారా ఆయనకు తగిన గౌరవం అందించనున్నట్లు తెలుస్తోంది.

Naga Chaitanya : నాగచైతన్య, శోభిత దీపావళి సెలబ్రేషన్స్.. పిక్స్ చూశారా

Exit mobile version