Vaishnavi Wushu : రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని నేదునూరు మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని బాత్క వైష్ణవి జాతీయ స్థాయి ఉషు (Wushu) పోటీలకు ఎంపికైంది. హైదరాబాద్ రెడ్ హిల్స్‌లోని జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ‘స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ’ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో వైష్ణవి అద్భుత ప్రదర్శన కనబరిచింది. అండర్-17 విభాగంలో, 56 కిలోల కేటగిరీలో రాణించి జాతీయ స్థాయికి అర్హత సాధించింది. వైష్ణవి తండ్రి శ్రీశైలం క్రీడల్లో ఆమెను ప్రోత్సహిస్తూ ఈ స్థాయికి తీసుకురావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
శ్రీనగర్‌లో జాతీయ ఛాంపియన్‌షిప్.. కమిషనర్ అభినందనలు
ఈ నెల అక్టోబర్ 15 నుండి 19 వరకు జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ వేదికగా జరగనున్న 70వ ఎస్‌జీఎఫ్ (SGF) జాతీయ ఉషు ఛాంపియన్ షిప్‌లో వైష్ణవి తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రతినిధిగా బరిలోకి దిగనుంది. జాతీయ స్థాయికి ఎంపికైన సందర్భంగా విద్యార్థినిని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ నవీన్ నికోలస్ ప్రత్యేకంగా అభినందించారు. శ్రీనగర్‌లో జరిగే జాతీయ పోటీల్లోనూ ఇదే రకమైన ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి బంగారు పతకం సాధించి తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
పాఠశాలలో వైష్ణవికి ఘన సత్కారం
జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై పాఠశాలకు, ప్రాంతానికి పేరు తెచ్చిన వైష్ణవిని నేదునూరు మోడల్ స్కూల్‌లో ఘనంగా సత్కరించారు. మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రిన్సిపాల్ విష్ణు ప్రియ, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు వైష్ణవిని అభినందించారు. జాతీయ వేదికపై నేదునూరు మోడల్ స్కూల్ కీర్తిని, తెలంగాణ రాష్ట్ర ఘనతను చాటి చెప్పాలని ప్రిన్సిపాల్ విష్ణు ప్రియ కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొని వైష్ణవికి శుభాకాంక్షలు తెలిపారు.

