Site icon NTV Telugu

Naveen Patnaik: ఫార్మా, ఐటీ రంగాల్లో హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందింది

Naveen Patnaik

Naveen Patnaik

Naveen Patnaik Comments On Hyderabad City: హైదరాబాద్ నగరం చాలా అభివృద్ధి చెందిందని.. ఫార్మా, ఐటీ రంగాల్లో గణనీయంగా దూసుకుపోతోందని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్‌లో ఫిక్కీ, ఒడిశా ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ఒడిషా ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన.. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పారిశ్రామిక వేత్తలను ఒడిశాకు ఆహ్వానించారు. ఒడిశాలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని.. పెట్టుబడిదారులకు ఒడిశా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ‘మేక్ ఇన్ ఒడిశా కాంక్లేవ్ 2022’కు తాను పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నానని తెలిపారు.

కాగా.. రెండు రోజుల పర్యటనలో భాగంగా నవీన్ పట్నాయక్ హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే! బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు ఆయన చేరుకోగా.. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. ఒడిశా ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో భాగంగా.. బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో పెట్టుబడిదారులతో నవీన్ పట్నాయక్ వన్ టు వన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. ఒడిశాలోని విభిన్న వ్యాపార అనుకూల పర్యావరణ వ్యవస్థ గురించి తెలియజేశారు. ఐటీ, విద్యుత్తు, చేనేత, మైనింగ్‌, మిషనరీ, ఉక్కు, అల్యూమినియం, ఎంఎస్‌ఎంఈ రంగాల్లో పెట్టుబడులపై ఇన్వెస్టర్స్‌తో చర్చించారు. గతంలో దుబాయ్, న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరులలో జరిగిన పెట్టుబడిదారుల సమావేశాల్లోనూ సీఎం నవీన్ పట్నాయక్ పాల్గొన్నారు.

అయితే.. సీఎం కేసీఆర్ ప్రస్తుతం తెలంగాణలో లేరు. యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు వెళ్లిన ఆయన.. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు. కొద్ది రోజుల నుంచి అక్కడే ఉన్న కేసీఆర్.. సోమవారం నవీన్ పట్నాయక్‌ను కలిసేందుకు రావొచ్చన్న వార్తలు వచ్చాయి. కానీ.. అనారోగ్య సమస్యల దృష్ట్యా ఆయన మరో నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. దీంతో.. నవీన్ పట్నాయక్‌ను కేసీఆర్ కలవలేరని స్పష్టమైంది.

Exit mobile version