Nalgonda MLA Kancherla Bhupal Reddy Responds On Vijay Reddy Case: ఇటీవల నల్గొండ జిల్లా ఎల్లమ్మ గూడెం సర్పంచ్ సంధ్యారెడ్డి భర్త విజయ్ రెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే! కొందరు గుర్తు తెలియని వ్యక్తులు.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న విజయ్ రెడ్డిని కారుతో అడ్డగించి, పంట పొలాల్లో హత్య చేశారు. అయితే.. రాజకీయ నాయకుల అండదండలతోనే తన భర్తను హతమార్చారని, తన భర్త హత్య విషయంలో నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి హస్తం కూడా ఉందని ఆమె ఆరోపించారు. ఆ ఆరోపణలపై తాజాగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి స్పందిస్తూ.. వాటిని ఖండించారు. సంధ్యారెడ్డి చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని అన్నారు.
సర్పంచ్ భర్త విజయ్ రెడ్డి దారుణ హత్య దురదృష్టకరమని, ఆయన హత్య వార్త తనను బాధించిందని భూపాల్ రెడ్డి ఎన్టీవీతో చెప్పారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని ఉన్నప్పటికీ.. సంధ్యారెడ్డి ఆరోపణలతో వెనక్కు తగ్గాల్సి వచ్చిందన్నారు. అంతర్గత సమస్యలు, వివాదాలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు. విజయ్ రెడ్డి హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు నేర చరిత్ర ఉందని.. నిందితులను పట్టుకునేందుకు తన పూర్తి సహకారం ఇస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు.. విజయ్ రెడ్డి హంతకులకు కోమటిరెడ్డి బ్రదర్స్‌తో సాన్నిహిత్యం ఉందని కూడా భూపాల్ రెడ్డి బాంబ్ పేల్చారు. మరి, దీనిపై వాళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇదిలావుండగా.. మూడు నెలల కిందటే హైదరాబాద్‌లో ఓ ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు తన భర్తపై ఎటాక్ చేశారని కూడా సంధ్యారెడ్డి చెప్పారు. తమకు ప్రాణహాని ఉందని రెండు నెలల క్రితమే ఎస్పీని కలిశామని, తిప్పర్తి పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్లామని, కానీ పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదని ఆమె వాపోయారు. కొన్ని రోజులుగా తమను రాజకీయంగా వేధిస్తున్నారని ఆరోపణలు చేసిన ఆమె.. గతంలో తమ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దే తన భర్తను హతమార్చేందుకు కుట్ర పన్నారని, కానీ గ్రామస్తులు ఉండటంతో వెనక్కు వెళ్లారని చెప్పింది.
