ఉమ్మడి నల్గొండ జిల్లాలో బకాయి సొమ్ములు అందక ధాన్యం రైతులు అవస్థలు పడుతున్నారు. వారం రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పినా.. నెలలు గడుస్తున్నాయి. తమ డబ్బులెప్పుడు వస్తాయోనని ధాన్యం అమ్మిన రైతులు ఎదురు చూస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో ధాన్యం రైతులు కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంకా 461 మంది రైతులకు సుమారు కోటి 25 లక్షలు చెల్లించాల్సి ఉంది కొనుగోలు కేంద్రాలు. డిసెంబర్ 25 నాటికి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసారు. మొత్తం 60 వేల 88 మంది రైతుల నుంచి మూడు లక్షల 23 వేల 294 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. 6వందల 33కోట్ల 25 లక్షల చెల్లింపులు జరగాల్సి ఉండగా, అధికారులు 59 వేల 627 మంది రైతులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాల్లో 632 కోట్ల 40లక్షలు జమ చేశారు. ఇంకా 461 మంది రైతుల ఖాతాల్లో కోటి 25 లక్షలు జమ కావాల్సి ఉంది.
ఆత్మకూరు(ఎస్) మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో రైస్ మిల్లర్లు, నిర్వహకులు నకిలీ ట్రక్ షీట్లు పెట్టి అక్రమాలు పాల్పడ్డారు. అధికారులు సైతం అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. మధ్యలో రైతులు నలిగిపోతున్నారు. ధాన్యం కొనుగోలులో అక్రమాల కారణంగా ప్రతి రైతు ఖాతాను క్షుణ్ణంగా పరిశీలించి, డబ్బులు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు. నెలల తరబడి విసిగి వేసారిన రైతులు ..బ్యాంకులు, అధికారులు చుట్టూ తిరుగుతున్నారు.