Site icon NTV Telugu

MP Soyam Bapurao: ఆ దాడులు చేయించింది తెలంగాణ ప్రభుత్వమే

Mp Soyam Bapurao

Mp Soyam Bapurao

MP Soyam Bapurao Fires On Attack On Tribal Farmers: పోడు భూముల సమస్యని సాకుగా చూపి.. అటవీ అధికారులు, పోలీసుల చేత ఆదివాసులపై తెలంగాణ ప్రభుత్వం దాడులు చేయించిందని ఎంపీ సోయం బాపురావ్ ఆరోపించారు. ఈ ఘటనలపై మానవ హక్కుల కమిషన్ స్పందించి.. బాధ్యులైన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ కార్యాలయానికి వెళ్లిన సోయం బాపురావ్.. ఛైర్మన్ జస్టిస్ ఏకే మిశ్రా, సెక్రటరీ జనరల్ దేవేందర్ కుమార్ సింగ్‌లను కలిశారు. తెలంగాణలో ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూముల సమస్యకు ఇంతవరకూ పరిష్కారం లభించలేదని.. ఆ భూముల్ని అటవీ అధికారులు బలవంతంగా లాక్కొని, ఆదివాసీ గుడేల నుండి అడవి బిడ్డలను తరలించేందుకు కుట్ర జరుగుతోందని వారికి ఫిర్యాదు చేశారు.

ఇటీవల మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోషగూడ గ్రామంలో అడవి బిడ్డలపై ఫారెస్ట్ పోలీస్ అధికారులు దాడులు చేసి, వారిని తీవ్రంగా గాయపరిచారని సోయం బాపురావ్ చెప్పారు. అంతేకాదు.. వారిపై అక్రమ కేసులు కూడా బనాయించారని వివరించారు. అలాగే.. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ పాత జిల్లాల పరిధిలోని ఏజెన్సీ భూముల్లో ఆదివాసులకు పట్టా ఇవ్వకుండా ఫారెస్ట్ అధికారులు నిర్బంధ చర్యలు సాగిస్తున్నారని వెల్లడించారు. కోయపోషగూడలో 12 మంది మహిళలను జైలుకు పంపి, వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసిన జస్టిస్ కే మిశ్రా.. అమానుషంగా దాడులు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై నివేదిక తెప్పించుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని మానవ హక్కుల కమిషన్ తమకు హామీ ఇచ్చినట్టు సోయం బాపురావు వివరించారు.

Exit mobile version