రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నా కూడా పర్యావరణ ప్రేమికుడిగా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంతో దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. పర్యావరణ హితం కోసం సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించారు. తాజాగా ఈ కార్యక్రమం నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టింది. అనేక మంది సెలబ్రెటీలు, రాజకీయ నాయకలను దేశవ్యాప్తంగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం చేయడంలో ఎంపీ సంతోష్ కుమార్ సక్సెస్ అయ్యారు. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన సద్గురు జగ్గీవాస్ దేవ్ కూడా సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను కొనియాడారు.
తాజాగా ఆదివారం ఆయన సిరిసిల్ల ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని శివకేశవుల ఆలయ పున:ప్రతిష్ట కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్సీలు నవీన్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో పాటు రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్ ఆనంద్ రావు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చందు, టీఆర్ఎస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.