Site icon NTV Telugu

MP Arvind: టీఆర్ఎస్ ఒక డ్రామా కంపెనీ.. అదొక కామెడీ బిట్

Mp Arvind

Mp Arvind

MP Arvind Fires On TRS Party Over Moinabad Farm House Incident: మొయినాబాద్ ఫాంహౌస్‌లో ఘటనపై బీజేపీ ఎంపీ అర్వింద్ స్పందిస్తూ.. టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ఒక డ్రామా కంపెనీ అని, ఆ నలుగురు ఎమ్మెల్యేల కథ ఓ సీరియస్ సినిమా మధ్యలో వచ్చే కామెడీ బిట్‌లా ఉందని సెటైర్ వేశారు. ఆ ఘటన చూసి తాము కాసేపు నవ్వుకున్నామని, నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు సెకండ్ హ్యాండ్ అని, అలాంటి వారికి అంత రేటు పలకదని ఎద్దేవా చేశారు. నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరిదీ గెలిచే ముఖం కాదని పేర్కొన్న అర్వింద్.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఏనాడూ కండువా కప్పదని తేల్చి చెప్పారు. బీజేపీలో ఎవరైనా చేరాలని అనుకుంటే.. తమ సిట్టింగ్ పదవులకు రాజీనామాలు చేసి, తనకు గానీ, బండి సంజయ్‌కి గానీ అప్లికేషన్ పెట్టుకోవాలన్నారు. తాము సర్వే నిర్వహించిన తర్వాతే టికెట్ ఇస్తామని స్పష్టంచేశారు.

ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని, ఒక్కో కుటుంబంపై రూ.4 లక్షల అప్పు పెట్టాడని అర్వింద్ ఆరోపించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క ఎకరాకూ నీళ్లు అందలేదని, రైతుకు రుణమాఫీ కూడా చేయలేదని అన్నారు. రైతు బంధు పేరుతో అన్నీ బంద్ చేసిన కేసీఆర్.. ఉచిత ఎరువులు, పంటలకు ఎంఎస్‌పీ కల్పిస్తామని ఇచ్చిన హామీలను కూడా ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. వ్యవసాయం, మౌళిక పరిశ్రమల అభివృద్ధికి లక్ష కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ.. రైతుల కోసం కేసీఆర్ ఎందుకు కేంద్రాన్ని నిధులు అడగడం లేదని నిలదీశారు. లక్ష ఉద్యోగాలిస్తామని చెప్పి.. ఇప్పటిదాకా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. ఇప్పుడు ఉప ఎన్నిక రావడం వల్ల.. మునుగోడుకు అది ఇస్తం, ఇది ఇస్తామని వట్టి మాటలు చెప్తున్నారని.. ఇన్నాళ్లు ఇవ్వకుండా ఏం చేశారని ప్రశ్నించారు. మునుగోడులో బీర్లు, బిర్యానీలు పంపిణీ చేస్తూ.. స్కూళ్లు, కాలేజీల్లో మాత్రం పురుగుల భోజనం పెడుతున్నారని ఆరోపించారు.

కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి, దాదాపు 52 వేల మందిని తొలగించిన ఘనత ఒక్క కేసీఆర్‌కే చెల్లిందని అర్వింద్ మండిపడ్డారు. ఇప్పటి వరకు టీచర్ల నియామకాలు జరగలేదని, వలసలు కూడా పదింతలు పెరిగాయని అన్నారు. ప్రజలు అవస్థలు పడుతుంటే.. సీఎం బిడ్డ మాత్రం రూ.500 కోట్ల ఇల్లు కట్టుకుందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో జర్నలిస్టులు దగా పడ్డారన్నారు. మునుగోడును నిండా ముంచిన కేసీఆర్ ప్రభుత్వం.. యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించలేదని ఎంపీ అర్వింద్ విమర్శించారు.

Exit mobile version