NTV Telugu Site icon

Moinabad Episode: తొలిరోజు ముగిసిన నిందితుల కస్టడీ.. 7 గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు

Sit Investigation Moinabad

Sit Investigation Moinabad

Moinabad Episode Accused First Day Custody Ended: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల్ని పోలీసులు కస్టడీకి తీసుకోవడంతో పాటు విచారణ కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలోనే తొలిరోజు కస్టడీలో భాగంగా.. సిట్ బృందం ముగ్గురు నిందితుల్ని ప్రశ్నించింది. రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్‌లను విడివిడిగా వేర్వేరు గదుల్లో ఉంచి విచారించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో.. ఎవరు ప్రలోభాలకు చేస్తే ఇక్కడికి వచ్చారని అధికారులు ప్రశ్నించారు. ఆ నిందితుల వెనుక ఉన్నది ఎవరని ఆరా తీశారు. ఈ విచారణ సమయంలో.. నిందితుల ముందు వారి కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్‌లను ఉంచారు. శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగింది. ఏడు గంటల పాటు సాగిన ఈ విచారణలో నిందితుల ముందు పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకే ప్రశ్నను ముగ్గురికి వేసి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేయగా.. కొన్ని ప్రశ్నలకు ముగ్గురు వేర్వేరు సమాధానాలు చెప్పినట్టు తేలింది.

ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు రామచంద్ర భారతి కావడంతో.. అతని కేంద్రంగా పోలీసులు విచారణ చేపట్టారు. అతని చరిత్ర గురించి ఆరా తీశారు. ఈ క్రమంలోనే.. ఢిల్లీ, హర్యానాలో స్వచ్చంద సంస్దల పేరుతో పలు కార్యకలాపాలను రామచంద్రభారతి నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. పూజల పేరుతో అతను పలువురు నేతలకు దగ్గరైనట్లు వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర, గోవాలో ప్రభుత్వాలను కులగొట్టినట్టు.. రామచంద్ర భారతి ఆడియో టేప్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే! అందులో ఢిల్లీలోనూ త్వరలో సర్కార్ కూలుతుందని అతను చెప్పాడు. ఆ విషయాలపై కూడా అధికారులు ఆరా తీశారు. అతని పరిచయాలపై, అలాగే వందల కోట్ల డబ్బులను ఎక్కడి నుండి తెస్తున్నారని రామచంద్ర భారతిని ప్రశ్నించారు. అయితే.. ఈ విచారణలో నిందితులు పూర్తిగా సహకరించలేదని తేలింది. కొన్ని ప్రశ్నలకు పొంతన లేని సమాధానలు ఇవ్వగా.. మరికొన్ని ప్రశ్నలకు మౌనం పాటించారు. రామచంద్ర భారతి కూడా కొన్ని ప్రశ్నలను దాటవేసినట్టు తేలింది. దీంతో.. రేపు ఉదయం మరోసారి నిందితుల్ని విచారించి, వారి నుంచి సమాధానం రాబట్టాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.