NTV Telugu Site icon

MLC Kavitha: ప్రీతి పేరెంట్స్‌కి కవిత లేఖ.. అండగా ఉంటామని హామీ

Kavitha Letter To Preethi P

Kavitha Letter To Preethi P

MLC Kalvakuntla Kavitha Letter To Medico Preethi Parents: ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడి, ఇటీవల ప్రాణాలు వదిలిన మెడికో ప్రీతి పేరెంట్స్‌ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. ప్రీతి మృతి పట్ల సంతాపం ప్రకటించిన ఆమె.. కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ‘‘గౌరవనీయులైన నరేందర్, శారద గారికి.. సోదరి డాక్టర్ ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఒక తల్లిగా నేను ఎంతో వేదనకు గురయ్యాను. ప్రీతి కోలుకోవాలని గత మూడు రోజులుగా కోరుకున్న కోట్లాది మందిలో నేనూ ఒకరిని. ఎన్నో కష్టాలకోర్చి పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రీతికి ఇలా జరగడం జీర్ణించుకోలేకపోతున్నాను. చదువుకుని సమాజానికి సేవ చేయాలన్న తపన, పట్టుదల మెండుగా ఉన్న ప్రీతికి ఇలా జరగడం దురదృష్టకరం. ఒక ఉత్తమ వైద్యురాలిని సమాజం కోల్పోయింది. అందుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. కడుపుకోత అనుభవిస్తున్న మీకు ఎంత ఓదార్పు ఇవ్వాలని ప్రయత్నం చేసినా.. అది చాలా తక్కువే అవుతుంది. ఏ తల్లిదండ్రులకు రాకూడని పరిస్థితి ఇది. మీ కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మీ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రీతి మరణానికి కారణమైన దోషులను రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టబోదు అని మీకు హామీ ఇస్తున్నాము’’ అంటూ ఆ లేఖలో రాసుకొచ్చారు.

Revanth Reddy: పేదలకు మంచి జరగాలంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలి

అంతేకాదు.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కవిత హామీ ఇచ్చారు. యావత్తు రాష్ట్ర ప్రజలు మీ వెంట ఉన్నారని ప్రీతి పేరెంట్స్‌కి భరోసా ఇచ్చారు. ఇటువంటి క్లిష్ట సమయంలో భగవంతుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలని తాను ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. కాగా.. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులతో తీవ్ర మనోవేదనకు గురైన మెడికో ప్రీతి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఐదు రోజుల పాటు నిమ్స్‌లో మృత్యువుతో పోరాడిన ప్రీతి.. ఫిబ్రవరి 26న రాత్రి 9:10 గంటలకు కన్నుమూసింది. మరోవైపు.. ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు మరో రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే.. కుటుంబంలో ఒకరిని ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది.

Partner Exchange: క్విడ్ ప్రోకో అంటే ఇదేనేమో.. భర్తలను మార్చుకున్న భార్యలు