NTV Telugu Site icon

MLA Seethakka: విధి లేని పరిస్థితిలోనే కోర్టును ఆశ్రయించా.. ఎమ్మెల్యే సీతక్క హాట్ కామెంట్స్

Mla Seetakka

Mla Seetakka

MLA Seethakka: విధి లేని పరిస్థితిలోనే కోర్టును ఆశ్రయించా కోర్టులోనైనా నాకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. ములుగు ఫై బీఆర్ఎస్ వివక్ష చూపిస్తుందని మండిపడ్డారు. ప్రతి ఎమ్మెల్యేకు నిధులు ఇచ్చి ప్రభుత్వం ములుగు నియోజకవర్గానికి ఇచ్చిన నిధులను ఎందుకు మంజూరు చేయడం లేదన్నారు. పలుకులు నియోజకవర్గంపై మిడతల దండు లాగా అధికార పార్టీ నేతలు దాడి చేస్తున్నారని అన్నారు. సరైన ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వందల కోట్లు ఖర్చుపెట్టి ఓడగొట్టడానికి చేస్తున్న రివ్యూ మానేసి ములుగు నియోజకవర్గం నిధులు ఎందుకు ఆగిపోయాయో వాటిపైన రివ్యూ చేయండి సీఎం గారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి లేని పరిస్థితిలోనే కోర్టును ఆశ్రయించా కోర్టులోనైనా నాకు న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వపరంగా వచ్చిన నష్టపరిహారం ఎమ్మెల్యేల సమక్షంలో అందించాలి కానీ ఇక్కడ అధికార పార్టీ నేతల సమక్షంలో నష్టపరిహారాలను అందిస్తున్నారని మండిపడ్డారు.

ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ నేతలు మిడతల దండయాత్ర చేశారని సీతక్క ఆరోపించారు. తన నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క గత వారం హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు పంపింది. తాను కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినందునే తన నియోజకవర్గానికి నిధులు మంజూరు కావడం లేదని సీతక్క ఆరోపించారు. దాదాపు 20 ఏళ్లుగా ములుగు ప్రజలకు సేవ చేస్తున్నానని సీతక్క తెలిపారు. గెలిచినా ఓడినా అది ప్రజల మధ్యే అని ఆమె గుర్తు చేశారు. వరదలు, కరోనా, అగ్ని ప్రమాదాల సమయంలో అధికార పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్లారని ఆమె ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నందున బీఆర్‌ఎస్ నేతలు నియోజకవర్గంలో మొగ్గు చూపుతున్నారని ఆమె విమర్శించారు.

బీఆర్‌ఎస్‌కు చెందిన బడే నాగజ్యోతి వచ్చే ఎన్నికల్లో ములుగు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. గత నెల 21న కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో నాగజ్యోతికి చోటు దక్కింది. నాగజ్యోతి ములుగు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. సీతక్కను ధీటుగా ఎదుర్కొనే అభ్యర్థి నాగజ్యోతి అని పార్టీ భావించింది. నాగజ్యోతిని బరిలోకి దింపారు. ములుగు అసెంబ్లీ స్థానాన్ని బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకునేలా ఆ పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. నాగజ్యోతిని అభ్యర్థిగా ప్రకటించడంతో బీఆర్ఎస్ నేతలు ఈ నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ తరుణంలో సీతక్క తన నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయడం లేదని హైకోర్టును ఆశ్రయించారు.

సీతక్క గతంలో ములుగు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ప్రాతినిధ్యం వహించారు. రేవంత్ రెడ్డితో పాటు ఆమె టీడీపీని వీడారు. కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డికి సీతక్క ప్రధాన అనుచరురాలు. సీతక్క గతంలో నక్సలైట్‌గా పనిచేసింది. జనజీవన స్రవంతిలో చేరిన సీతక్క టీడీపీలో చేరారు. ములుగు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బడే నాగజ్యోతి తల్లిదండ్రులు కూడా నక్సలైట్లే. దీంతో బీఆర్ఎస్ నాగజ్యోతిని బరిలోకి దింపిందన్న ప్రచారం లేకపోలేదు.