MLA Raja Singh Gives Warning On Munawar Faruqui Show In Hyderabad: మునవ్వర్ ఫారుఖీ.. ఇతనొక స్టాండప్ కమెడియన్. ఎప్పుడైతే కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘లాకప్’ షోలో అడుగుపెట్టాడో, అప్పట్నుంచి అతని దశ తిరిగిపోయింది. ఆ షోలో తనదైన కామిక్ టైమింగ్, కవిత్వాలతో అందరి మనసులు దోచాడు. అందుకే, ఆ షో విన్నర్‌గా నిలిచాడు. దీంతో, అతనికి సర్వత్రా క్రేజ్ నెలకొంది. అతనితో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అతను హైదరాబాద్‌కి రాబోతున్నాడు. ఈనెల 20వ తేదీన ‘డోంగ్రీ టు నోవేర్’ పేరుతో ఓ లైవ్ షో ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఫారుఖీ ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమంగా వెల్లడించాడు.
ఈ నేపథ్యంలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఫారుఖీ షో నిర్వహిస్తే, ఆ ప్రదేశాన్ని తగలబెట్టేస్తామని హెచ్చరించారు. అతని ఈవెంట్ నిర్వహించకుండా ఆపాలని తెలంగాణ ప్రభుత్వం, పోలీసు అధికారుల్ని కోరారు. అతడ్ని ఎవరైనా సహకరిస్తే, వాళ్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని తేల్చి చెప్పారు. గతంలో ఓ కార్యక్రమంలో భాగంగా సీతాదేవిపై ఫారుఖీ జోకులు వేసినందుకు వివాదాస్పదమైంది. కర్ణాటకలో అతడ్ని బ్యాన్ చేశారు. అందుకే, హైదరాబాద్‌లోనూ అతడి షోలు నిర్వహించకూడదని రాజాసింగ్ కోరుతున్నారు. నిజానికి.. ఈ ఏడాది జనవరిలోనే ఫారుఖీ హైదరాబాద్‌లో షో నిర్వహించాల్సింది. కానీ, ఆ సమయంలో కరోనా కేసులు పెరగడంతో క్యాన్సిల్ చేసుకున్నాడు.
ఆ సమయంలోనే రాజాసింగ్ ఫైరయ్యారు. ఫారుఖీ హైదరాబాద్‌లో అడుగుపెడితే, తాము చేయాల్సింది చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అలాగే.. ఫారుఖీ రాకను కేటీఆర్ స్వాగతించడంపై కూడా ఆయన మండిపడ్డారు. తానొక సెక్యులర్‌నని కేటీఆర్ర ప్రొజెక్ట్ చేసుకుంటున్నారని, అందుకు అతను సిగ్గుపడాలని రాజాసింగ్ అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లు కలిసి.. హిందూ సొసైటీని కామెడీ చేసి పారేశారని విమర్శించారు. అందుకు కేటీఆర్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ ఓ కాస్మోపాలిటన్ నగరమని.. మనతో రాజకీయంగా పొత్తు పెట్టుకోనంత మాత్రాన ఫారుఖీ కార్యక్రమాన్ని రద్దు చేయమని తేల్చి చెప్పారు.